- దౌత్యవర్గాల నుంచి సమాచారం అందిందన్న ‘ఏపీ’ వార్తా సంస్థ
- బంతి ఇప్పుడు ఇరాన్ కోర్టులోనే ఉంది: జేడీ వాన్స్
- ఇరాన్ పోర్టుల నుంచి హార్మూజ్ దాటిన రెండు నౌకలు
వాషింగ్టన్: ఇరాన్, అమెరికా మధ్య ఆదివారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో జరిగిన సుదీర్ఘ చర్చలు విఫలమైన నేపథ్యంలో ఆ రెండు దేశాల మధ్య మరో విడత చర్చలు జరిగే అవకాశం ఉందని ‘అసోసియేటెడ్ ప్రెస్(ఏపీ)’ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ అంశంపై పలువురు దౌత్యవేత్తల నుంచి సమాచారం అందినట్టు తెలిపింది. అమెరికా డిమాండ్లను ఒప్పుకునేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందన్న సంకేతాలు వస్తే.. గురువారం మళ్లీ చర్చలు జరిగే చాన్స్ ఉందని పేర్కొంది.
ఈ విడత చర్చల వేదికను జెనీవాకు మార్చడం లేదంటే మళ్లీ ఇస్లామాబాద్ లోనే నిర్వహించడంపైనా ఇరు దేశాలు పరిశీలిస్తున్నాయని వివరించింది. కాల్పుల విరమణ గడువు (ఈ నెల 21) ముగిసేలోపు, ఆరు వారాల యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో ఒక ఒప్పందానికి రావడానికి ఇరు దేశాలు చర్చలను పున:ప్రారంభించడం గురించి ఆలోచిస్తున్నాయని వెల్లడించింది. అయితే, మొదటి విడత చర్చల్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ బృందం, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబాఫ్ బృందం పాల్గొన్నాయని.. ఈసారి అవే ప్రతినిధి బృందాలు హాజరవుతాయా? లేదా? అన్నది మాత్రం స్పష్టంగా తెలియలేదని పేర్కొంది.
వేదిక, సమయం ఇంకా నిర్ణయించలేదని, కానీ గురువారం చర్చలు మాత్రం జరిగే అవకాశం ఉన్నట్టు తెలిసినట్టుగా వివరించింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘అవతలి పక్షం నుంచి మాకు పిలుపు వచ్చింది. వారు ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటున్నారు’ అని చెప్పిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
బంతి ఇప్పుడు ఇరాన్ కోర్టులోనే ఉంది: జేడీ వాన్స్
పాకిస్తాన్‌లో ఇటీవల జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయన్న వాదనలను తోసిపుచ్చుతూ, పశ్చిమాసియా సంఘర్షణలో తదుపరి దశను ఇరానే నిర్ణయిస్తుందని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అన్నారు. ఫాక్స్ న్యూస్‌తో ఆయన మాట్లాడుతూ.. తుది ఒప్పందం కుదరనప్పటికీ చర్చలు ఫలప్రదంగా సాగాయని అభివర్ణించారు. "బంతి ఇప్పుడు పూర్తిగా వారి కోర్టులోనే ఉంది. తదుపరి ఏం జరగాలనేది ఇరానీయులే నిర్ణయిస్తారని నేను భావిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం సహా అమెరికా ప్రాధాన్యతలను ఈ చర్చలు స్పష్టం చేశాయని ఆయన అన్నారు. ‘వారు మా దిశగా అడుగులు వేశారు. అందుకే మాకు కొన్ని మంచి సంకేతాలు కనిపించాయని మేము చెబుతున్నాము. కానీ వారు తగినంతగా ముందుకు రాలేదు’ అని భిప్రాయపడ్డారు. అయితే, ఒప్పందాన్ని ఖరారు చేసే అధికారం ఇరాన్ చర్చల ప్రతినిధులకు లేకపోవడం వల్లే చర్చలు ముగిశాయన్నారు. "వారు టెహ్రాన్‌కు వెళ్లి, సుప్రీం లీడర్ నుంచి లేదా మరెవరి నుంచైనా మేము విధించిన నిబంధనలకు ఆమోదం పొందాల్సి ఉంది" అని ఆయన వివరించారు.
హార్మూజ్ దాటిన 2 ‘ఇరాన్’ నౌకలు
మెరైన్ ట్రాకింగ్ సంస్థ కెప్లర్ మంగళవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. అమెరికా సైనిక దిగ్బంధనం ఉన్నప్పటికీ, సోమవారం రెండు నౌకలు హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించాయి. లైబీరియా జెండాతో ఉన్న 'క్రిస్టియానా' అనే బల్క్ క్యారియర్, ఇరాన్ ఓడరేవు బందర్ ఇమామ్ ఖొమేనీలో మొక్కజొన్నను అన్‌లోడ్ చేసిన తర్వాత వ్యూహాత్మక జలసంధి గుండా ప్రయాణించింది. సోమవారం అమెరికా దిగ్బంధనం అమలులోకి వచ్చిన రెండు గంటల తర్వాత, ఇది ఇరాన్‌కు చెందిన లారక్ ద్వీపాన్ని దాటింది.
కోమోరోస్ జెండాతో ఉన్న 'ఎల్పిస్’ అనే ట్యాంకర్ కూడా లారక్ ద్వీపం సమీప మార్గంలో జలసంధిని దాటినట్లు గణాంకాలు చూపిస్తున్నాయి. కాగా, శాంతి చర్చలు విఫలమవడంతో, ఇరాన్ ఓడరేవుల నుంచి బయలుదేరే లేదా లోపలికి వచ్చే నౌకలను బ్లాక్ చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ఆదేశించారు. ఈ దిగ్బంధనాన్ని సవాలు చేసే ఇరాన్ పడవలను నాశనం చేస్తామని ఆయన హెచ్చరించారు.

