ప్రపంచ దేశాలకు గుడ్ న్యూస్.. రష్యా ఇంధనపై అమెరికా నెల పాటు ఆంక్షలు ఎత్తివేత

ప్రపంచ దేశాలకు గుడ్ న్యూస్.. రష్యా ఇంధనపై అమెరికా నెల పాటు ఆంక్షలు ఎత్తివేత

వాషింగ్టన్: ప్రపంచ దేశాలకు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. రష్యా చమురు కొనుగోళ్లపై విధించిన ఆంక్షలను మరో నెల రోజుల పాటు సడలించింది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ శాఖ సోమవారం (మే 18) ప్రకటించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో చమురు ధరలు పెరగకుండా నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. అమెరికా ఆంక్షల సడలింపుతో రష్యా నుంచి భారీ స్థాయిలో ఆయిల్ కొనుగోళ్లు చేసే ఇండియాతో పాటు పలు దేశాలకు భారీ ఊరట దక్కనుంది. 

కాగా, ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోన్న రష్యా ఆర్థిక వనరులను దెబ్బతీయడానికి రష్యా ముడి చమురుపై అమెరికా కఠిన ఆంక్షలు విధించింది. తమ మాట లెక్క చేయకుండా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీగా సుంకాలు విధిస్తామని హెచ్చరించింది. దీంతో ఇండియాతో పలు దేశాలు రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను తగ్గించాయి. ఈ క్రమంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది. 

►ALSO READ | రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆగవు.. అమెరికా ఆంక్షలు లైట్ తీసుకున్న ఇండియా..!

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధనం ధర రికార్డ్ స్థాయిలో పెరిగింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలను అదుపులో ఉంచేందుకు రష్యా ముడి చమురుపై విధించిన ఆంక్షలను అమెరికా నెల రోజుల పాటు తాత్కలికంగా సడలించింది. ఈ గడువు ఆదివారం (మే 17)తో ముగిసింది. కానీ పశ్చిమాసియాలో పరిస్థితులు చక్కబడకపోవడంతో ప్రపంచ దేశాల్లో ఇంధన కొరత సమస్య వేధిస్తోంది. 

దాంతో రష్యా ముడి చమురుపై విధించిన ఆంక్షలను మరికొన్ని రోజుల పాటు సడలించాలని ప్రపంచదేశాలు అమెరికాను విజ్ఞప్తి చేశాయి. ఆయా దేశాల విజ్ఞప్తి మేరకు రష్యా ముడి చమురుపై విధించిన ఆంక్షలను మరో నెల రోజుల పాటు సడలించింది అమెరికా ట్రెజరీ శాఖ. అమెరికా నిర్ణయంతో రష్యా నుంచి భారీగా ఆయిల్ కొనుగోలు చేసే ఇండియాతో పాటు పలు దేశాలకు భారీ ఊరట.