200 వ్యవసాయ ఉత్పత్తులపై ట్రంప్ టారిఫ్ లేనట్టే.. ఫుడ్ ధరలు పెరగడంతో దిగొచ్చిన అమెరికా ప్రభుత్వం

 200 వ్యవసాయ ఉత్పత్తులపై  ట్రంప్ టారిఫ్ లేనట్టే.. ఫుడ్ ధరలు పెరగడంతో దిగొచ్చిన అమెరికా ప్రభుత్వం

మసాలాలు, టీ, కాఫీ, పండ్లపై టారిఫ్ మినహాయింపు
ఒక బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఎగుమతులకు ఊరట

న్యూఢిల్లీ: ఇండియా వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల భారం తగ్గింది.  యూఎస్‌‌‌‌లో ఫుడ్ రేట్లు భారీగా పెరగడంతో కొన్ని ఆహార ఉత్పత్తుల దిగుమతులపై ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ మినహాయింపులు  ఇచ్చారు.   సుంకాల తగ్గింపుతో  భారతీయ మసాలా వ్యాపారులు, టీ ఉత్పత్తిదారులకు పెద్ద ఊరట లభిస్తుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. దాదాపు 200 ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తగ్గిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌‌‌‌పై ట్రంప్ సంతకం చేశారు. ఈ  ప్రొడక్ట్‌‌‌‌లపై 25 శాతం నుంచి 50 శాతం వరకు టారిఫ్ పడగా, ఇక నుంచి ఎటువంటి టారిఫ్ ఉండదు.  

రొయ్యలకు నో

అయితే  రొయ్యలు, ఇతర సముద్ర ఆహారాలు, బాస్మతి బియ్యం వంటి అధిక విలువ కలిగిన ఉత్పత్తులపై సుంకాలు తగ్గించలేదు.   అలాగే రత్నాలు, ఆభరణాలు, దుస్తులపై ఇంకా 50శాతం టారిఫ్ పడుతోంది.  మొత్తం మీద  భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే  ఒక బిలియన్ డాలర్ల (రూ.8,800 కోట్ల) విలువైన వ్యవసాయ ఉత్పత్తులకు  ట్రంప్ ప్రభుత్వం టారిఫ్‌‌‌‌ల  మినహాయింపు ఇచ్చింది. ‘‘ ఈ నిర్ణయంతో సుమారు  50 ప్రాసెస్‌‌‌‌డ్ ఫుడ్ కేటగిరీలు లాభపడతాయి. 

గత ఏడాది యూఎస్‌‌‌‌కి జరిగిన  491 మిలియన్ డాలర్ల విలువైన టీ, కాఫీ ఎక్స్‌‌‌‌ట్రాక్టులు, కోకో ఉత్పత్తులు, పండ్ల రసాలు, మామిడి ఉత్పత్తులు, వెజిటబుల్ వెక్స్ (మైనం) ఎగుమతి అయ్యాయి. 359 మిలియన్ డాలర్ల విలువైన మసాలాల ఎగుమతులపై కూడా టారిఫ్ మినహాయింపు దొరికింది .  కొబ్బరి, జామ, మామిడి, జీడిపప్పు, అరటి, అనాస వంటి మరో 48 రకాల పండ్లు, గింజలు -కూడా లాభపడనున్నాయి.   భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే 5.7 బిలియన్ డాలర్ల  వ్యవసాయ ఎగుమతుల్లో వీటి వాటా ఐదో వంతుకు సమానం”అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌‌పోర్ట్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఐఈఓ) ప్రకటించింది.  

ఈ తగ్గింపులతో అమెరికా మార్కెట్‌‌‌‌లో  భారతీయ ఎగుమతులకు సమాన అవకాశాలు దొరుకుతాయని పేర్కొంది. అమెరికాలో ఇండియా ప్రొడక్ట్‌‌‌‌లపై నమ్మకం పెరుగుతోందని,  డిస్ట్రిబ్యూషన్  నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లు, ఎన్‌‌‌‌ఆర్ఐల డిమాండ్ కారణంగా విస్తరిస్తామని  వివరించింది. అమెరికా పరిశ్రమ సంఘాలు ఈ సుంకాల తగ్గింపును స్వాగతించగా, విమర్శకులు మాత్రం ట్రంప్ ఆర్థిక కష్టాలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కాగా, ట్రంప్ టారిఫ్‌‌‌‌ల వలన అమెరికాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతోంది.  ప్రజల్లో అసంతృప్తి ఎక్కువైంది.  రిపబ్లికన్లకు తాజా న్యూయార్క్ మేయర్ ఎలక్షన్స్‌‌‌‌లో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే.

వీటికి మినహాయింపు

ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే నల్ల మిరియాలు, లవంగాలు, జీలకర్ర, యాలకులు, పసుపు, అల్లం, వివిధరకాల టీ, మామిడి ఉత్పత్తులు, జీడిపప్పు వంటి ఉత్పత్తులపై తాజాగా మినహాయింపు దొరికింది. 2024లో భారత్ అమెరికాకు 500 మిలియన్ డాలర్ల విలువైన మసాలాలు, 83 మిలియన్ డాలర్ల విలువైన టీ, కాఫీ ఎగుమతి చేసింది. అమెరికా ప్రపంచవ్యాప్తంగా 843 మిలియన్ డాలర్ల విలువైన జీడిపప్పు దిగుమతి చేసుకోగా, అందులో ఐదో వంతు భారత్ నుంచే వెళుతోంది.