
న్యూయార్క్: వరల్డ్ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ అరీనా సబలెంకా యూఎస్ ఓపెన్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. వరుసగా మూడోసారి మెగా టోర్నీ ఫైనల్‌కు చేరుకుంది. అమెరికా యువ సంచలనం అమాండా అనిసిమోవా అద్భుత ఆటతో అదరగొడుతూ సబలెంకాతో టైటిల్ ఫైట్‌కు రెడీ అయింది. సెమీఫైనల్లో అమెరికన్ జెస్సికా పెగులాకు సబలెంకా చెక్ పెట్టగా.. జపాన్ స్టార్ నవోమి ఒసాకాపై అనిసిమోవా పైచేయి సాధించింది. గురువారం అర్ధరాత్రి జరిగిన విమెన్స్ సింగిల్స్ సెమీస్ ఫైట్‌లో ఎనిమిదో సీడ్ అనిసిమోవా 6–-7 (4/7), 7-–6 (7/3), 6–-3తో నాలుగు గ్రాండ్ స్లామ్స్ విన్నర్, 23వ సీడ్ ఒసాకాపై సంచలన విజయం సాధించింది. దాంతో ఈ సీజన్‌లో వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్‌లో ఆమె ఫైనల్ చేరుకుంది. 2 గంటల 56 నిమిషాల ఈ పోరులో ఒసాకా ఒక దశలో విజయం అంచున నిలిచినా అనిసిమోవా తన శక్తివంతమైన గ్రౌండ్‌స్ట్రోక్స్‌తో ఆమెను ఓడించింది. గ్రాండ్ స్లామ్ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్‌లో 14–0తో ఉన్న ఒసాకా రికార్డును అనిసిమోవా బద్దలు కొట్టింది.
ఆరంభం నుంచే హోరాహోరీగా సాగిన ఈ పోరులో తొలి సెట్‌ను టై బ్రేక్‌లో నెగ్గిన ఒసాకా రెండో సెట్‌లోనూ సత్తా చాటింది. ఒక దశలో మూడు మ్యాచ్ పాయింట్లపై నిలిచింది. కానీ, మ్యాచ్ తన చేతిలో ఉన్నప్పుడు జపాన్ ప్లేయర్ అనూహ్యంగా ఒత్తిడికి గురవగా.. అనిసిమోవా మాత్రం భయం లేకుండా ఆడింది. ఒసాకా 6--–5తో సర్వ్ చేస్తున్నప్పుడు అనిసిమోవా సానుకూల దృక్పథంతో, పవర్‌ఫుల్ గ్రౌండ్ స్ట్రోక్స్‌తో ప్రత్యర్థికి సవాల్ విసిరింది. ఈ సెట్ టై-బ్రేక్‌లో గెలుచుకున్న తర్వాత అమండాకు విజయంపై నమ్మకం పెరిగింది. మూడో సెట్ ఒసాకా చేసిన ఒక తప్పుతో నాలుగో గేమ్‌లో ఆమెకు కీలక బ్రేక్ లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకున్న అమెరికన్ చివరికి మూడు మ్యాచ్ పాయింట్లతో విజయాన్ని ఖరారు చేసుకుంది. ఈ పోరులో ఒసాకా 15 ఏస్‌లు, 32 విన్నర్లు కొట్టి ఐదు బ్రేక్ పాయింట్లు సాధించింది. ఒక డబుల్ ఫాల్ట్, 27 అనవసర తప్పిదాలు చేసింది. ఏడు ఏస్‌లు కొట్టి 6 బ్రేక్ పాయింట్లు సాధించిన అనిసిమోవా.. ఏకంగా 50 విన్నర్లతో అదరగొట్టింది.
జెస్సికా జోరుకు అరీనా బ్రేక్
గతేడాది ఫైనల్లో అమెరికన్ జెస్సికా పెగులాను ఓడించి టైటిల్ నెగ్గిన బెలారస్ స్టార్ సబలెంకా ఈసారి సెమీఫైనల్లోనే ఆమెకు చెక్ పెట్టింది. సెమీస్ పోరులో టాప్ సీడ్ అరీనా 4-–6, 6–-3, 6–-4తో నాలుగో సీడ్ పెగులాపై విజయం సాధించింది. దాంతో పెగులాపై తన విజయాల రికార్డును 8–-2కి పెంచుకుంది. పైకప్పు మూసిన ఆర్థర్ ఆషే స్టేడియంలో 2 గంటల 5 నిమిషాల ఈ మ్యాచ్‌లో ఆరంభంలో సబలెంకా సత్తా చాటింది. తన మూడో బ్రేక్ పాయింట్‌ను ఉపయోగించుకుని 4–-2 ఆధిక్యం సంపాదించింది. కానీ పెగులా దూకుడుగా ఆడుతూ సబలెంకా బ్యాక్‌హ్యాండ్‌ను టార్గెట్ చేసింది. ఈ క్రమంలో వరుసగా నాలుగు గేమ్స్ గెలిచి మొదటి సెట్‌ను సొంతం చేసుకుంది. కానీ రెండో సెట్‌లో అరీనా తన ఆటను మెరుగుపరుచుకుంది.
నాణ్యమైన షాట్లతో వరుసగా మూడు గేమ్స్ నెగ్గి 3-–0 ఆధిక్యాన్ని సంపాదించిన ఆమె అదే జోరుతో సెట్‌ను గెలుచుకుంది. నిర్ణయాత్మక మూడో సెట్లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. పెగులాకు ఏడు బ్రేక్ పాయింట్లు దొరికినా ఆమె కేవలం రెండింటిని మాత్రమే ఉపయోగించుకోగలిగింది. సబలెంకా కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమించి మూడో మ్యాచ్ పాయింట్లు గెలిచింది. ఈ పోరులో 8 ఏస్‌లు, కొట్టిన అరీనా 15 నెట్ పాయింట్లు, 3 బ్రేక్ పాయింట్లు సాధించింది. 4 డబుల్ ఫాల్ట్స్, 27 అవనసర తప్పిదాలు చేసినా 43 విన్నర్లతో పైచేయి సాధించింది. 3 ఏస్‌లు, 2 బ్రేక్ పాయింట్లు, 13 నెట్ పాయింట్లకు పరిమితమైన పెగులా 4 డబుల్ ఫాల్ట్స్,15 అనవసర తప్పిదాలు చేసిన 21 విన్నర్లు మాత్రమే కొట్టగలిగింది. ఆదివారం తెల్లవారుజామున జరిగే ఫైనల్లో అనిసిమోవాతో సబలెంకా అమీతుమీ తేల్చుకోనుంది. ఇందులో గెలిస్తే 2012-–14 మధ్య వరుసగా యూఎస్ ఓపెన్ గెలిచిన సెరెనా విలియమ్స్ తర్వాత మళ్ళీ ఆ ఘనత సాధించిన ప్లేయర్‌గా అరీనా రికార్డు సృష్టిస్తుంది.
భాంబ్రీ సెమీస్‌తో సరి
ఇండియా డబుల్స్ స్టార్ యూకీ భాంబ్రీ కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ నెగ్గాలన్న కల నెరవేరలేదు. ఓపెన్ ఎరాలో గ్రాండ్ స్లామ్ డబుల్స్ సెమీఫైనల్ చేరిన నాలుగో ఇండియన్‌గా నిలిచిన యూకీ సెమీస్‌లోనే తన పోరాటం ముగించాడు. సెమీఫైనల్లో యుకీ భాంబ్రీ–-మైఖేల్ వీనస్ (న్యూజిలాండ్) 7-–6 (7/2), 6–-7 (5/7), 4-–6 తోబ్రిటన్ ద్వయం నీల్ స్కుప్‌స్కీ, జో సాలిస్‌బరీ చేతిలో పోరాడి ఓడిపోయింది. మూడు గంటల పోరులో తొలి సెట్‌ను టై బ్రేక్‌లో నెగ్గి ఆశలు రేపినా.. తర్వాతి రెండు సెట్లలో కీలక సమయాల్లో ఒత్తిడికి తలొగ్గి ఇంటిదారి పట్టింది.