అమెరికాలో ట్యాలెంట్ ఉన్నోళ్లు తక్కువే!.. డొనాల్డ్ ట్రంప్

అమెరికాలో ట్యాలెంట్ ఉన్నోళ్లు తక్కువే!.. డొనాల్డ్ ట్రంప్
  • విదేశీయులను తీసుకోవాల్సిన అవసరం ఉంది: ట్రంప్  
  • హెచ్1బీ వీసాపై మాట మార్చిన యూఎస్ ప్రెసిడెంట్ 
  • ట్రెయినింగ్ లేకుండా నిరుద్యోగులను నియమించుకోలేం 
  • అమెరికన్​లు విదేశీయుల నుంచి స్కిల్స్ నేర్చుకోవాలని కామెంట్స్

వాషింగ్టన్: ఇండియా సహా పలు దేశాల నుంచి హెచ్1బీ వీసాలపై వస్తున్న స్కిల్డ్ వర్కర్ల వల్ల అమెరికన్లకు ఉద్యోగాలు పోతున్నాయంటూ ఇదివరకు ఆంక్షలు విధించిన యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తాజాగా మాట మార్చారు. అమెరికాలో టాలెంట్​ ఉన్నోళ్లు తగినంత మంది లేరని, టాలెంట్​ లేని నిరుద్యోగులను కీలక రంగాల్లో నియమించుకోలేమని కామెంట్ చేశారు. 

అమెరికన్లు టాలెంట్​ ఉన్న విదేశీయుల నుంచి స్కిల్స్ నేర్చుకోవాలన్నారు. మంగళవారం ‘ఫాక్స్ న్యూస్’ చానెల్ ప్రతినిధి లారా ఇన్ గ్రాహమ్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. టెక్నాలజీ, ఇండస్ట్రియల్ వంటి రంగాల్లో విదేశాల నుంచి స్కిల్డ్ వర్కర్లను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా రక్షణ రంగంలో కీలక పరికరాల తయారీకి దేశంలో నిపుణుల కొరత ఉందన్నారు. 

ఆయా రంగాల పురోగతి కోసం విదేశీయులను నియమించుకోవడం అనివార్యమన్నారు. హెచ్1బీ వీసా ప్రోగ్రాంలో సంస్కరణలు తేవడం అమెరికా ప్రభుత్వానికి ప్రయార్టీ అంశంగా మారింది కదా? అన్న ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. ఇది నిజమే కానీ విదేశీ టాలెంట్​ కూడా దేశానికి అవసరమేనన్నారు. దీనిపై లారా స్పందిస్తూ.. దేశంలో టాలెంట్​ ఉన్నోళ్లకు కొదవ లేదన్నారు. దీనిని ట్రంప్ తిరస్కరించారు. ‘‘అమెరికాలో కొన్ని ప్రత్యేక స్కిల్స్ అవసరమైన రంగాల్లో టాలెంట్​ ఉన్నోళ్లు లేరు. నిరుద్యోగులను నేరుగా కీలక రంగాల్లో నియమించుకోలేం” అని చెప్పారు.

టాలెంట్​ లేనోళ్లను నియమించుకోలేం.. 

ఐదేండ్లుగా నిరుద్యోగులుగా ఉంటూ, ఎలాంటి ట్రెయినింగ్, స్కిల్స్ లేని అమెరికన్లను క్లిష్టమైన మాన్యుఫాక్చరింగ్, డిఫెన్స్ వంటి రంగాల్లో నియమించుకోలేమని ట్రంప్ స్పష్టం చేశారు. ఇటీవల జార్జియాలోని హ్యుందాయ్ ప్లాంట్​పై అధికారులు రెయిడ్ చేసి.. వందలాది మంది సౌత్ కొరియన్ వర్కర్లను అరెస్ట్ చేసి, డిపోర్ట్ చేయడాన్ని ట్రంప్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘‘సౌత్ కొరియన్లకు బ్యాటరీల తయారీలో నైపుణ్యం ఉంటుంది. ఇది చాలా కాంప్లికేటెడ్​గా ఉంటుంది. చిన్న పొరపాటు జరిగినా అవి పేలిపోతాయి. 

హ్యుందాయ్ ప్లాంట్​పై రెయిడ్ తర్వాత అక్కడ ఇప్పుడు కీలకమైన ఉత్పత్తుల తయారీలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం” అని ఆయన వివరించారు. ‘‘ఏ దేశం కూడా 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ప్లాంట్​ను నిర్మించి, అందులో ఎలాంటి ట్రెయినింగ్ పొందని నిరుద్యోగులను నియమించుకోదు. దీర్ఘకాలిక నిరుద్యోగులు, టాలెంట్​ లేనోళ్లతో మిసైల్స్ తయారు చేయడం సాధ్యం కాదు” అని ట్రంప్ చెప్పారు.