యురేనియం అప్పగించాలి.. ఇరాన్ కు అమెరికా 5 షరతులు 

యురేనియం అప్పగించాలి.. ఇరాన్ కు అమెరికా 5 షరతులు 

నష్టపరిహారం ఇవ్వం.. కొన్ని అణు కేంద్రాలే నడపాలి
చర్చలకు ఇరాన్ పెట్టిన కండిషన్లకు తిరస్కరణ 
ఇరాన్ మీడియా వెల్లడి 

టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలకు సంబంధించిన ప్రతిపాదనల్లో అమెరికా 5 షరతులను విధించిందని ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇరాన్ వద్ద ఉన్న 400 కిలోల శుద్ధిచేసిన యురేనియం అప్పగించాలని, అణు కేంద్రాల్లో కొన్నింటిని మాత్రమే నిర్వహించాలని అమెరికా కండిషన్లు పెట్టినట్టు తెలిపింది. అలాగే యుద్ధం వల్ల జరిగిన నష్టానికి ఎలాంటి పరిహారం ఇవ్వబోమని, విదేశాల్లో స్తంభింపచేసిన ఇరాన్ ఆస్తుల్లో కనీసం 25 శాతం ఆస్తులనూ విడుదల చేయబోమని, ఈ షరతులన్నింటికీ ఒప్పుకున్నా.. భవిష్యత్తులో మళ్లీ దాడులు చేయబోమన్న హామీ సైతం ఇవ్వబోమని స్పష్టం చేసినట్టు ఈ మేరకు ఇరాన్ ‘ఫార్స్’ న్యూస్ ఏజెన్సీ ఆదివారం పేర్కొంది. 

గతంలో విధించిన ఆంక్షలు, విధానపరమైన నిర్ణయాల వల్ల జరిగిన నష్టాలకుగాను ఇరాన్‌‌కు ఎలాంటి పరిహారం చెల్లించబోమని కూడా అమెరికా తేల్చిచెప్పిందని వివరించింది. యుద్ధాన్ని ముగించడానికి చర్చలు జరపాలని ఇరాన్ చేసిన ప్రతిపాదనకు అమెరికా తన స్పందనలో నిర్దిష్ట రాయితీలు ఇవ్వడంలో విఫలమైందని ఇరాన్ మెహర్ వార్తా సంస్థ తెలిపింది. 

"అమెరికా ఎటువంటి స్పష్టమైన రాయితీలు ఇవ్వకుండా, యుద్ధంలో తాము సాధించలేకపోయిన రాయితీలను పొందాలని భావిస్తోంది. ఇది చర్చలలో ప్రతిష్టంభనకు దారితీసింది" అని పేర్కొంది. చర్చలు జరగడానికి వీలుగా ఐదు ముందస్తు షరతులను ఇరాన్ విధించిందని.. లెబనాన్ సహా అన్ని చోట్లా యుద్ధం ఆపడం, ఇరాన్ పై ఆంక్షలు ఎత్తేయడం, ఇరాన్ నిధులను విడుదల చేయడం, యుద్ధనష్టాలకు పరిహారం, హార్మూజ్ జలసంధిపై ఇరాన్ సార్వభౌమాధికారాన్ని గుర్తించడం వంటి షరతులు ఇందులో ఉన్నాయని తెలిపింది. అయితే, వీటిలో ఏ ఒక్క షరతుకూ అమెరికా ఒప్పుకోలేదని వెల్లడించింది. 

కాగా, ఇరాన్ చేసిన 14 పాయింట్ల శాంతి ప్రతిపాదనను కూడా ట్రంప్ ఇటీవల తిరస్కరించారు. దీనికి ప్రతిస్పందనగా, ఇరాన్ ప్రతిపాదనను అమెరికా ఆమోదించకపోతే, అమెరికా పన్ను చెల్లింపుదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఘాలిబాఫ్ హెచ్చరించినట్లు ‘ది హిల్’ మీడియా సంస్థ పేర్కొంది.