జాహ్నవికి మరణానంతరం డిగ్రీ..నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్శిటీ ప్రకటన

జాహ్నవికి మరణానంతరం డిగ్రీ..నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్శిటీ ప్రకటన

అమెరికాలోని సియాటిల్ లో  పోలీసు పెట్రోలింగ్ వెహికల్ ఢీ కొని చనిపోయిన తెలుగు విద్యార్థిని జాహ్నవికి డిగ్రీ ఇవ్వాలని  నార్త్ ఈస్ట్రన్ యూనివర్శిటీ నిర్ణయించింది. యూనివర్శిటీ  ఛాన్స్ లర్ జాహ్నవి మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

జాహ్నవి మృతి తర్వాత జరిగిన పరిణామాలతో తమ క్యాంపస్‌లోని భారత విద్యార్థులు తీవ్రంగా ప్రభావితులయ్యారని తెలిపారు .ఈ  సమయంలో  భారత విద్యార్థులకు తాము అండగా ఉంటామని చెప్పారు.  ఈ ఘటనలో నిందితులకు తప్పకుండా శిక్ష పడుతుందని భావించారు. జాహ్నవి మరణాంతరం డిగ్రీ పట్టా ఇవ్వాలనుకున్నామని.. ఆమె కుటుబ సభ్యుల్లో ఒక్కరికి డిగ్రీ అందిజేస్తామని తెలిపారు.

 అసలేం జరిగిందంటే..

ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి 2021 లో అమెరికాకు వెళ్లింది. అక్కడ సౌత్ లేక్  యూనియన్ లోని నార్త్ ఈస్ట్రన్ వర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. జనవరి 23న కాలేజ్ నుంచి ఇంటికి బయల్దేరింది. రోడ్డు దాటుతుండగా పోలీసు వెహికల్ ఢీ కొట్టింది. దాంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది.  ఈ ఘటనకు సంబంధించిన వీడియో  బయటపడింది. ఆ వీడియోలో జాహ్నవి పట్ల పోలీసు అధికారి చులకనగా మాట్లాడిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

జాహ్నవిని ఢీ కొట్టే సమయంలో  పోలీస్ వెహికల్ స్పీడ్ గంటకు 119 కి.మీగా ఉందని తెలుస్తోంది. హై స్పీడ్ తో ఢీ కొట్టడం వల్లే జాహ్నవి 100 అడుగుల దూరంలో ఎగిరిపడిందని సీటెల్ పోలీసులు తెలిపారు. జాహ్నవి మృతితో పాటు పోలీస్ అధికారిపై  కూడా విచారణ కొనసాగుతోంది.