నా భార్య క్రిస్టియన్ కాదు.. ఆమెకు మతం మారే ఆలోచన లేదు

నా భార్య క్రిస్టియన్ కాదు.. ఆమెకు మతం మారే ఆలోచన లేదు
  • అమెరికా వైస్ ప్రెసిడెంట్  జేడీ వాన్స్  
  • అంతకుముందు తాను చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ

వాషింగ్టన్: తన భార్య ఉష క్రిస్టియన్  కాదని, మతం మారే ఆలోచన ఆమెకు లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్  అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’ లో ఆయన పేర్కొన్నారు. హిందూ అయిన తన భార్య ఉష.. మతం మారితే బాగుంటుందని ఇంతకుముందు ఆయన వ్యాఖ్యానించారు. తమ పిల్లలను క్రిస్టియన్లుగానే పెంచుతున్నామని, ఉష కూడా తమతో చర్చికి వస్తారని, ఏదో ఒకరోజు మతం మారుతారని పేర్కొన్నారు. విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన స్పందించారు. మతాంతర వివాహం పూర్తిగా తన వ్యక్తిగతమని, దీనిపై బహిరంగ చర్చ అనవసరమన్నారు. ‘‘నా భార్య మతం మారితే బాగుంటుందని నేను చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి” అని చెప్పారు. ఇక, మానవాళికి గాస్పెల్  మంచిదని క్రిస్టియానిటీ ద్వారానే తాను తెలుసుకున్నానని వెల్లడించారు. ‘‘నా మతాన్ని తిరిగి అనుసరించాలని నా భార్య కొన్నేండ్ల క్రితమే నన్ను ఎంకరేజ్  చేసింది. అలాగే, తను (ఉష) కూడా తన మతాచారాలను పాటిస్తుంది. ఆమె క్రిస్టియన్  కాదు. మతం మారాలన్న ఆలోచన ఆమెకు లేదు. అయితే, మతాంతర పెండ్లి చేసుకున్న చాలా మంది లాగే నేను కూడా ఆలోచిస్తా. నేనుకున్నట్లు నా భార్య చేస్తుందని (క్రిస్టియానిటీకి మారడం) ఆశిస్తున్నా” అని వాన్స్  పేర్కొన్నారు. కాగా.. గత నెల 29న మిసిసిపిలో జరిగిన ఓ కార్యక్రమంలో వాన్స్  మాట్లాడుతూ ఉష తనతో పాటు చర్చికి వస్తుందన్నారు. ‘‘నేను క్రిస్టియన్  గాస్పెల్ ను నమ్ముతా. ఉష కూడా అలాగే చేస్తుందని ఆశిస్తున్నా. అయితే, నేను అనుకున్నట్లే చేయాలని ఏమీ లేదు. ఎందుకంటే, దేవుడు ప్రతిఒక్కరికీ స్వేచ్ఛ ఇచ్చాడు” అని వాన్స్  వ్యాఖ్యానించారు.

హిందూయిజంనూ పాటించండి

క్రిస్టియానిటీని పాటిస్తున్నట్లే హిందూ మతాన్ని కూడా అనుసరించాలని జేడీ వాన్స్ కు హిందూ అమెరికన్  ఫౌండేషన్  (హాఫ్) విజ్ఞప్తి చేసింది. ‘‘క్రిస్టియానిటీని మళ్లీ పాటించాలని మీ భార్య మీకు సూచించారు. అలాగే హిందూ మతాన్ని కూడా పాటించండి. హిందువుల మతాచారాలను గుర్తించండి” అని హాఫ్  కోరింది. ఈ మేరకు హాఫ్​ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే, మత స్వేచ్ఛకు వ్యతిరేకంగా మాట్లాడిన వాన్స్  మద్దతుదారులపై తీవ్రంగా విమర్శలు చేసింది.