
H1B ఫీజు విషయంలో విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. అమెరికా బయట నుంచి వచ్చే దరఖాస్తులకే H1B ఫీజు లక్ష డాలర్లని అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనతో ఇప్పటికే అమెరికాలో H1B వీసాపై ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ దక్కినట్లయింది. అమెరికాలోనే చదువుకుని ఉద్యోగాల కోసం హెచ్-1బీ వీసా దరఖాస్తు చేసుకొనే విదేశీ విద్యార్థులు లక్ష డాలర్లు చెల్లించాల్సిన అవసరం లేదని USCIS స్పష్టం చేసింది. బయట దేశాల నుంచి అమెరికాకు వెళ్లి ఉద్యోగం చేయాలనుకునే దరఖాస్తుదారులు మాత్రం ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చింది.
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులు ముందుగా కొన్నేళ్లు అక్కడ చదవాల్సి ఉంటుందని పేర్కొంది. హెచ్1బీ వీసా ఫీజు పెంపునకు సంబంధించి సెప్టెంబర్ 21న ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన సెప్టెంబరు 21 తర్వాత దాఖలైన దరఖాస్తులకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ ఫీజు చెల్లింపుల కోసం ఆన్‌లైన్ సేవలు ప్రారంభించినట్లు వెల్లడించింది. H1B ఫీజు పెంచే సమయానికి అమెరికాలో ఉన్నవారికి లక్ష డాలర్ల ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ వంటి సంస్థలు హెచ్1బీ వీసాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఒక్కో ఉద్యోగి కోసం జరిపే వీసా ఖర్చు పెరగడం వల్ల ప్రాజెక్ట్ మార్జిన్లు తగ్గుతాయి. ముఖ్యంగా స్మాల్ అండ్ మిడ్-సైజ్ కంపెనీలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. వీసా ఖర్చు అధికంగా ఉన్నందున, కంపెనీలు స్థానిక అమెరికన్ ఉద్యోగులను నియమించేందుకు మొగ్గు చూపొచ్చు. దీని వల్ల భారతీయ ఉద్యోగులకు అవకాశాలు తగ్గే అవకాశం ఉంది. కానీ, ట్రంప్ చర్యలతో అమెరికాలో టెక్ ట్యాలెంట్ తగ్గిపోతుంది. టెక్ ఇన్నోవేషన్లు తగ్గిపోతాయనడంలో సందేహం లేదు.
యూఎస్ ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్ల (రూ.88 లక్షల) కు పెంచడంతో తాత్కాలికంగా ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ నష్టపోయినా, లాంగ్‌టెర్మ్‌లో లాభాలెన్నో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటే లోకల్‌గా ఉద్యోగాలు పెంచొచ్చని, అలానే ఐటీ కంపెనీలు తమ ఎక్స్‌పోర్ట్స్ మోడల్‌ను మార్చుకుంటే ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. అమెరికన్ టెక్ కంపెనీలు లోకల్‌గా తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీల) ను విస్తరించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
.@USCIS has issued updated guidance on the H-1B Procolomation on their website (https://t.co/dPCGt5ZPhj) pic.twitter.com/L1Fmn1d92I
— Steven Brown (@AttyStevenBrown) October 20, 2025