వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్ విడాకులు తీసుకోబోతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల మెలానియా ట్రంప్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉషా వాన్స్ చేతికి మ్యారేజ్ రింగ్ లేకపోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఈ క్రమంలో విడాకుల పుకార్లపై ఉషా వాన్స్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ‘‘ముగ్గురు పిల్లల తల్లి అయిన ఉషా ఇంట్లో పనులు, పిల్లల సంరక్షణలో భాగంగా కొన్నిసార్లు తన ఉంగరాన్ని మర్చిపోతారు’’ అని విడాకుల పుకార్లకు చెక్ పెట్టారు. ఉంగరం పెట్టుకోనంత మాత్రాన విడాకులు తీసుకుంటున్నట్లు అర్థం కాదని క్లారిటీ ఇచ్చారు.
ఇటీవల ఉషా వాన్స్ మతంపై జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. హిందూ మతంలో పెరిగిన తన భార్య ఉషా ఏదో ఒక రోజు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తుందని ఆశిస్తున్నానని జేడీ వాన్స్ అనడం వివాదానికి దారి తీసింది. ఇదిలా ఉండగానే, టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ కార్యక్రమంలో ఎరికా కిర్క్‌ను జేడీ వాన్స్ హృదయపూర్వకంగా కౌగిలించుకోవడంతో విడాకుల పుకార్ల ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి.
ఈ పరిణామాల అనంతరం జేడీ, ఉష విడాకులు తీసుకోబోతున్నారని.. ఉషా చేతికి మ్యారేజ్ రింగ్ తీసేయడమే ఇందుకు సాక్ష్యమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా జేడీ వాన్స్, ఉషా వాన్స్ విడాకులపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో విడాకుల పుకార్లపై ఉషా బృందం వివరణ ఇచ్చింది. ఇంట్లో పనుల వల్ల కొన్నిసార్లు ఉషా ఉంగరం పెట్టుకోవడం మర్చిపోతారని క్లారిటీ ఇచ్చి విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టారు.
జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ భారత సంతతికి చెందిన మహిళ అన్నది తెలిసిన విషయమే. ఆమె తల్లిదండ్రులు క్రిష్, లక్ష్మి చిలుకురి 1970లో భారత్ నుంచి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. క్రిష్ చిలుకురి శాన్ డియాగో స్టేట్ యూనివర్శిటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో లెక్చరర్‌గా కాగా.. ఉషా తల్లి లక్ష్మీ చిలుకురి మాలిక్యులర్ బయాలజీ విభాగంలో టీచింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. దీంతో పాటు శాన్ డియాగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో సిక్స్త్ కాలేజీకి ప్రోవోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
ఇక.. ఉషా, జెడీ వాన్స్ యేల్ లా స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఒకరికొకరు పరిచమయ్యారు. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించి హిందు సంప్రాదాయంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. ప్రముఖ న్యాయవాది అయిన ఉషా వాన్స్ యూఎస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ జి రాబర్ట్స్ దగ్గర క్లర్క్‌గా పనిచేశారు.
