
పారాసెటమాల్గా పాపులర్ అయిన ఎసిటమైనోఫెన్ గురించి హార్వర్డ్ నిపుణులు ఒక కీలక విషయాన్ని బయటపెట్టారు. జ్వరం, ఒళ్లు నొప్పులకు మన దేశంలో విపరీతంగా వినియోగంలో ఉన్న పారాసిటమల్ను గర్భం దాల్చిన మహిళలు వాడటం అంత మంచిది కాదని మౌంట్ సినై అండ్ హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనంలో వెల్లడైంది.
ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ పెయిన్ కిల్లర్ డ్రగ్ అయిన పారాసిటమల్ను గర్భిణిలు వాడటం వల్ల వారికి పుట్టే చిన్నారులు ఆటిజంతో పాటు అటెన్షన్ డెఫ్లిక్ట్హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ADHD) బారిన పడుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. మొత్తం లక్ష మందిపై అధ్యయనం చేశారు. గతంలో చేసిన 46 పరిశోధనలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తర్వాత పిల్లల్లో ఆటిజం సమస్యకు తల్లులు గర్భంతో ఉన్నప్పుడు పారాసిటమల్ వాడటం కూడా ఒక కారణమని హార్వర్డ్ నిపుణులు ఒక నిర్ధారణకు వచ్చారు.
గర్భం దాల్చిన మూడు నెలల లోపు పారాసిటమల్ వాడితే ఆటిజం ముప్పు ఎక్కువగా ఉందని తేలినట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. అయితే.. అలా అని గర్భిణులు పారాసిటమల్ వాడటం ఉన్నట్టుండి ఆపేయొద్దని కూడా వైద్యులు సూచించారు. గర్భంతో ఉన్న మహిళలు వైద్యుడిని సంప్రదించి మెడికేషన్ తీసుకోవాలని.. ఒళ్లు నొప్పులు, జ్వరంతో.. గర్భంతో ఉన్న మహిళ బాధపడితే కడుపులో ఉన్న బిడ్డకు కూడా హాని జరిగే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు.
జ్వరమొచ్చినా, తలనొచ్చినా.. ఒంట్లో కాస్త నలతగా అనిపించినా సరే డోలో 650 ట్యాబ్లెట్ మింగడం భారతీయులకు అలవాటుగా మారిందని ఇప్పటికే డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కరోనా తర్వాత డోలో వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ ట్యాబ్లెట్ అమ్మకాలు గతంలోకంటే రెట్టింపు అయినట్లు ఆ కంపెనీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే, సాధారణ పరిస్థితుల్లో డోలో ప్రమాదకరం కాకపోయినప్పటికీ అతి వాడకం అనేక అనర్థాలకు దారితీసే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరించారు. ఈ పెయిన్ కిల్లర్‌కు సంబంధించిన ఏ ట్లాబ్లెట్స్ ఎక్కువగా వాడినా దాని ప్రభావం కిడ్నీలపై పడుతుంది. ఈ మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కిడ్నీ సమస్యలు, డయాలసిస్ బాధితులు పెరుగుతున్నారు. వారిలో ఎక్కువ మంది పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కిడ్నీ సమస్యల బారిన పడుతున్నారు.