అయినదానికి.. కానిదానికి గర్భసంచులు తీసేస్తున్నరు

అయినదానికి.. కానిదానికి గర్భసంచులు తీసేస్తున్నరు
  • హిస్టరెక్టమీ ఆపరేషన్లు పెరుగుతున్నయ్
  • పేషెంట్ల అమాయకత్వాన్ని క్యాష్
  • చేసుకుంటున్న క్లినిక్ లు
  • ఈ ఆపరేషన్లలో ఏపీ ఫస్ట్.. ఆరో ప్లేస్ లో తెలంగాణ
  • కేంద్ర ఆరోగ్య శాఖ రిపోర్ట్

హైదరాబాద్, వెలుగుమహిళలకు గర్భసంచి ఆపరేషన్లు పెరుగుతున్నయి. తీవ్ర హెల్త్ సమస్యలు వచ్చి తప్పనిసరి అయితేనే గర్భసంచిని తొలగించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆల్టర్నేటివ్ ట్రీట్ మెంట్లు ఉన్నప్పటికీ, చిన్న చిన్న కారణాలతోనే  ఆపరేషన్లు చేయడం ఎక్కువైపోయింది. రాష్ట్రంలో 45 ఏండ్లు, ఆపై మహిళల్లో 16.8 శాతం మంది హిస్టరెక్టమీ (గర్భసంచిని తొలగించే ఆపరేషన్) చేయించుకున్నరు. హిస్టరెక్టమీ ఆపరేషన్లలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ లో.. తెలంగాణ ఆరో ప్లేస్ లో ఉందని కేంద్ర హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా హిస్టరెక్టమీ ఆపరేషన్లు, వాటిస్టడీ వివరాలతో ‘లాంగిట్యూడినల్ రిపోర్ట్ 2020’ని కేంద్రం విడుదల చేసింది. పేద, మిడిల్ క్లాస్ మహిళల్లోనే ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయని రిపోర్ట్ లో తేలింది.

రూరల్ ఏరియాల్లోనే ఎక్కువ..

దేశంలో 45 ఏండ్లు, ఆపై వయసున్న మహిళల్లో 11% మంది హిస్టరెక్టమీ చేయించుకున్నారని రిపోర్ట్ లో వెల్లడైంది. ప్రతి10 మంది మహిళల్లో ఒకరు గర్భసంచిని తొలగించుకుంటున్నట్లు తెలుస్తోంది. మన రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామాల్లో ఉండే మహిళల్లోనే హిస్టరెక్టమీ ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. అర్బన్‌‌‌‌లో13.6%, రూరల్‌‌‌‌లో 18.5% మంది హిస్టరెక్టమీ చేయించుకున్నారు. గతంలో వరంగల్ రూరల్, మహబూబాబాద్​ జిల్లాల్లోని తండాల్లో చాలా మంది మహిళలకు ప్రైవేటు హాస్పిటల్స్​లో గర్భసంచులు తొలగించినట్లు అధికారులు గుర్తించారు. కొందరు ప్రైవేట్ డాక్టర్లు మహిళల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని, అవసరం లేకున్నా హిస్టరెక్టమీ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

హెల్త్‌‌‌‌పై ఎఫెక్ట్‌‌‌‌..

హిస్టరెక్టమీ తర్వాత మహిళలకు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే చాన్స్ ఉందని డాక్టర్ లు హెచ్చరిస్తున్నారు. కాన్పుల మధ్య ఎడం లేకపోవడం, చిన్న వయసులోనే ప్రెగ్నెంట్ కావడం, ఎనీమియా, పోషకాహారం లోపం వంటి అనేక కారణాల వల్ల మహిళలకు గర్భసంచి సంబంధ వ్యాధులు వస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు.