నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం

నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం

తెలంగాణ లోక్ సభ ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి భువనగిరి అభ్యర్ధి కోమటి రెడ్డి గెలుపొందగా.. మరో అభ్యర్థి  ఉత్తమ్ కుమార్ నల్గొండలో భారీ విజయం సాధించారు. 19 వేల పైగా భారీ మెజార్టీతో ఉత్తమ్ గెలుపొందారు.

ఉత్తమ్ పూర్తి పేరు నలమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 1962 జూన్ 20న అప్పటి నల్లగొండ జిల్లా తాటిపాముల గ్రామంలో జన్మించారు. ఇప్పుడు సూర్యాపేట జిల్లా. బీఎస్సీ చదివారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫైటర్ పైలట్‌గా విధులు నిర్వర్తించారు.

ఉత్తమ్ రాజకీయ ప్రస్థానం:

1994లో ఉద్యోగానికి రాజీనామా చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి తొలిసారి 1994లో కోదాడ ఎన్నికల బరిలో నిలిచి తొలిసారి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 1999, 2004, 2009లో మూడుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి గెలిచారు.

2014 ఎన్నికలకు తెలంగాణలోని బీసీలను ఆకట్టుకునేందుకు పొన్నాల లక్ష్మయ్యను పీసీసీ అధ్యక్షుడిగా నియమించిన కాంగ్రెస్ అధిష్టానం.. ఎన్నికల తర్వాత మళ్లీ రెడ్డి సామాజికవర్గాన్ని అక్కున చేర్చుకోవడం ప్రారంభించింది. ఆ క్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పగ్గాలు అప్పగించింది. 2015 ఫిబ్రవరిలో ఆయన్ను తెలంగాణ పీసీసీ కెప్టెన్‌గా చేసింది. అప్పటి నుంచి నేటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గానూ పనిచేశారు.