డిండి లిఫ్ట్ ఎత్తును ఫిక్స్ చేయండి...ఏదుల నుంచి ఏ లెవెల్ వద్ద తీసుకోవచ్చో తేల్చండి: మంత్రి ఉత్తమ్

డిండి లిఫ్ట్ ఎత్తును ఫిక్స్ చేయండి...ఏదుల నుంచి ఏ లెవెల్ వద్ద తీసుకోవచ్చో తేల్చండి: మంత్రి ఉత్తమ్
  •     పోతిరెడ్డిపల్లి వద్ద బ్యారేజీ పనులను వెంటనే ప్రారంభించండి
  •     ఈ నెల 15 నాటికి ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోండి
  •     ఏఎమ్మార్పీ ఎస్​ఎల్​బీసీ కెనాల్​ కెపాసిటీని 4 వేల క్యూసెక్కులకు పెంచండి
  •     మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డితో కలిసి ప్రాజెక్ట్​పై రివ్యూ 

హైదరాబాద్, వెలుగు: డిండి లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్ట్​ ఆఫ్​టేక్​ పాయింట్​ఎత్తును వెంటనే కన్ఫర్మ్​ చేయాలని ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం సెక్రటేరియెట్​లో మంత్రి ఉత్తమ్​ను శాసనమండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో కలిసి సమీక్షించారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్​ స్కీమ్​లోని ఏదుల రిజర్వాయర్​నుంచి డిండి లిఫ్ట్​ అప్రోచ్​ చానెల్​కు నీళ్లను ఎంత ఎత్తు నుంచి తీసుకోవచ్చో ఆ లెవెల్​ను వెంటనే ఫిక్స్​ చేయాల్సిందిగా ఇరిగేషన్​ శాఖ సెక్రటరీ శ్రీధర్, ఈఎన్​సీ రమేశ్​ బాబును మంత్రి ఉత్తమ్​ఆదేశించారు. 

పోతిరెడ్డిపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని, అందుకు సంబంధించిన ఆర్థిక అనుమతులను ఈ నెల 15 నాటికి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏఎమ్మార్పీ ఎల్​ఎల్​బీసీ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 2,400 క్యూసెక్కుల నుంచి 4 వేల క్యూసెక్కులకు పెంచేలా చర్యలు తీసుకోవాలని, ఆ తర్వాతే కాంక్రీట్​ లైనింగ్​ వర్క్స్​ను చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆ తర్వాత దాని సామర్థ్యాన్ని 6 వేల క్యూసెక్కులకు పెంచుకోవచ్చన్నారు. 

ఏఎమ్మార్పీ ఎస్​ఎల్బీసీ కెనాల్​కాంక్రీట్​ లైనింగ్​ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.443 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ ప్రాజెక్ట్​ పూర్తయితే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 228 ఫ్లోరైడ్​ ప్రభావిత గ్రామాలకు తాగునీటిని, 3.61 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు వీలవుతుందన్నారు. ప్రాజెక్టుకు నెలలో స్టేజ్​ 1 ఫారెస్ట్​ అనుమతులు వస్తాయని మంత్రి తెలిపారు. డిండి బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​కు గేట్లను బిగించేందుకు టెండర్లను పిలవాలని అధికారులను ఆదేశించారు. పెండ్లిపాక బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​ రివైజ్డ్​ ఎస్టిమేట్స్​పైనా మంత్రి సమీక్షించారు. దీనిపై హైపవర్​కమిటీతో చర్చిస్తామన్నారు. వచ్చే నెల కేబినెట్​ మీటింగ్​లో రివైజ్డ్​ ఎస్టిమేట్స్​ పెట్టాలని సూచించారు. 

కాగా, డిండి లిఫ్ట్​ స్కీమ్​లో భాగంగా 25.31 టీఎంసీల స్టోరేజ్​ సామర్థ్యంతో నాలుగు ఆన్​లైన్​ రిజర్వాయర్లు, ఐదు ఆఫ్​లైన్​ రిజర్వాయర్లను నిర్మించనున్నారు. పోతిరెడ్డిపల్లిలో బ్యారేజ్ హెడ్​వర్క్స్​, 16 కిలోమీటర్ల టన్నెల్​ పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​ పనులు 95 శాతం వరకు పూర్తయ్యాయి. మూడు గ్రామాలు, నల్గొండ, నాగర్​కర్నూల్​ జిల్లాలోని దాదాపు 450 ఎకరాల అటవీ భూముల ముంపు ప్రభావంతో స్పిల్​ వే పనులు నిదానంగా సాగుతున్నాయి.