Green Tax: రోడ్ ట్రిప్స్ కోసం వెళ్లే చాలా మంది ఉత్తరాఖండ్ వెళుతుంటారు. అయితే త్వరలో మీరు అక్కడికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఆ రాష్ట్రం కొత్తగా విధిస్తున్న గ్రీన్ టాక్స్ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. అసలు ఏంటి ఈ గ్రీన్ టాక్స్, దీనిని ఎందుకు విధిస్తారు.. ఎంత కట్టాలి వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తరాఖండ్ ప్రభుత్వం టూరిస్టులు అలాగే బయటి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలపై కొత్తగా గ్రీన్ టాక్స్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త టాక్స్ డిసెంబర్ 2025 నుంచి స్టార్ట్ అవుతుందని, ఎంట్రీ పాయింట్ల వద్ద దీనిని అధికారులు వసూలు చేస్తారని చెప్పింది. పర్యావరణ రక్షణకోసమే వాహనదారులపై ఈ టాక్స్ విధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం చెప్పింది. పొల్యూషన్ తగ్గించటంతో పాటు పర్యావరణ రక్షణకు ఈ నిధులను ఉపయోగించనున్నట్లు చెప్పింది.
వాహనం బరువు, రకాన్ని బట్టి రేట్లు ఉంటాయని ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడించింది. నాన్ లోకల్ వాహనాలపై చిన్న కార్లకు రూ.80 నుంచి హెవీ ట్రక్కులకు రూ.700 వరకు గ్రీన్ టాక్స్ రూపంలో వసూలు చేయనున్నట్లు వెల్లడైంది. చిన్న వాహనాలకు రూ.80, చిన్న కార్గో వాహనాలకు రూ.250, బస్సులకు రూ.140 చొప్పున రేట్లను ఫిక్స్ చేశారు. ఈ గ్రీన్ టాక్స్ వసూలు కోసం బోర్డర్ల దగ్గర ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాల సంఖ్యను 16 నుంచి 37కి పెంచారు. దీని ద్వారా స్థానిక రిజిస్ట్రేషన్ కాని వాహనాల వాలెట్ల నుంచి టాక్స్ డిడక్ట్ చేస్తారు.
గ్రీన్ టాక్స్ టూవీలర్లు, ప్రభుత్వ వాహనాలు అలాగే ఉత్తరాఖండ్ వాహనాలకు మాత్రం వర్తించదు. ఈ వ్యవస్థ పూర్తిగా టోల్ చార్జీలు వసూలు చేసిన మాదిరిగానే పనిచేస్తుందని తెలుస్తోంది. దేశంలోని మహారాష్ట్ర, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, డిల్లీ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు మాత్రం పాత వాహనాలపై మాత్రమే గ్రీన్ టాక్స్ వసూలు చేస్తున్నాయి. ఉత్తరాఖండ్ మాత్రం అన్ని వాహనాలకూ దీనిని వర్తింపచేస్తోంది.
