
ఐపీఎల్ 2025లో 14 ఏళ్ళ కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి చేదు అనుభవం ఎదురైంది. ఆడిన మూడో మ్యాచ్ లోనే 35 బంతుల్లో సెంచరీ చేసి ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపుకు తిప్పుకున్న వైభవ్.. తర్వాత మ్యాచ్ లో మరో మ్యాజికల్ ఇన్నింగ్స్ ఆడడంలో విఫలమయ్యాడు. గురువారం (మే 1) ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రెండో బంతికే డకౌటయ్యాడు. మెరుపు ఇన్నింగ్స్ పక్కన పెడితే క్రీజ్ లో నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేదు. జైపూర్ వేదికగా మాన్సింగ్ స్టేడియంలో డకౌట్ అయ్యి ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచాడు.
చాహర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతిని మిడ్ ఆన్ దిశగా ఆడిన వైభవ్.. విల్ జాక్స్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వైభవ్ ఔటవ్వగానే స్టేడియం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. వైభవ్ ఔట్ కావడంతో రాజస్థాన్ వరుసగా వికెట్లను కోల్పోతూ వచ్చింది. పవర్ ప్లే లోనే ఆ జట్టు జైశ్వాల్, నితీష్ రానా, హెట్ మేయర్ వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం 8 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసి పరాజయం దిశగా పయనిస్తోంది.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు రికెల్ టన్ (38 బంతుల్లో 61:7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (36 బంతుల్లో 53:9 ఫోర్లు ) మెరుపులకు తోడు సూర్య కుమార్ యాదవ్(23 బంతుల్లో 48:4 ఫోర్లు, 3 సిక్సులు) హార్దిక్ పాండ్య(23 బంతుల్లో 48: 6 ఫోర్లు, సిక్సర్) దంచి కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ రాయల్స్ లో తీక్షణ, పరాగ్ చెరో వికెట్ తీసుకున్నారు.