BC కమిషన్‌‌ చైర్మన్‌‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు

BC కమిషన్‌‌ చైర్మన్‌‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు
  •     ముగ్గురు మెంబర్స్‌‌‌‌ను కూడా నియమించిన రాష్ట్ర ప్రభుత్వం
  •     కోర్టు ఆదేశాలతో టర్మ్‌‌‌‌ ముగిసిన రెండేళ్లకు నియామకం
  •     చైర్మన్‌‌‌‌, మెంబర్స్ అందరూ టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ బ్యాగ్రౌండ్ ఉన్నోళ్లే

తెలంగాణ బీసీ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు నియమించింది. కమిషన్‌ చైర్మన్‌గా హుజూరాబాద్‌ పట్టణానికి చెందిన డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు (దాసరి)ను అపాయింట్‌ చేసింది. మరో ముగ్గురు.. సీహెచ్‌ ఉపేంద్ర (కమ్మరి), శుభప్రధ్‌ పటేల్‌ నూలి (లింగాయత్‌), కె.కిశోర్‌ గౌడ్‌ను కమిషన్‌ మెంబర్స్‌గా నియమించింది. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీళ్లతో పాటు మెంబర్‌ సెక్రటరీగా బీసీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్ కమిషనర్‌ ఉంటారు. ఉత్తర్వులు వెంటనే అమల్లోకి రానున్నాయి. చైర్మన్‌, మెంబర్స్‌ అందరూ టీఆర్‌ఎస్‌ బ్యాగ్రౌండ్‌కు చెందిన వారే కావడం గమనార్హం. తనను కమిషన్‌ చైర్మన్‌గా నియమించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటానని కృష్ణమోహన్‌రావు తెలిపారు. 
గడువు ముగిసిన రెండేళ్లకు..
బీసీ కమిషన్‌ టర్మ్‌ ముగిసిన సుమారు రెండేళ్లకు కొత్త కమిటీని ప్రభుత్వం నియమించి. అది కూడా మూడు వారాల్లో కమిటీని నియమించాలని కోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం స్పందించింది. 2016లో జీవో 25 ద్వారా తొలి బీసీ కమిషన్‌ను చైర్మన్, ముగ్గురు సభ్యులతో ప్రభుత్వం నియమించింది. వీరి పదవీకాలం అక్టోబర్ 2019లో ముగిసింది. అప్పటి నుంచి కొత్తగా ఎవరినీ నియమించలేదు. దీంతో అనేక సమస్యలు ఎదురవుతూ వచ్చాయి. వివిధ రంగాల్లో రిజర్వేషన్లు అమలవట్లేదు. రిక్రూట్‌మెంట్లలో బీసీలకు అన్యాయం జరుగుతోంది. కొన్ని చోట్ల బీసీల గ్రామ బహిష్కరణ జరిగింది. తమ బాధలు చెప్పుకోవడానికి కమిషన్‌ లేక బీసీలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. 
అంతా ‘హుజూరాబాద్‌’కే..
రాష్ట్ర ప్రభుత్వం నియమాకాలు, నిధులన్నీ హుజూరాబాద్‌ నియోజకవర్గానికే పరిమితం చేస్తోంది. ఇప్పటికే అక్కడి నుంచి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా బండా శ్రీనివాస్‌ను నియమించింది. కౌశిక్ రెడ్డికి నామినేటెడ్‌ ఎమ్మెల్సీ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కరీంనగర్‌ జిల్లాకే చెందిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పనిచేస్తున్న సాంస్కృతిక సారథి పోస్టుకు కేబినెట్‌ హోదా కల్పించింది. దళిత బంధు పథకానికి హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసింది. ఇప్పటికే రెండు దఫాలుగా మొత్తం రూ. వెయ్యి కోట్లు రిలీజ్‌ చేసింది. పింఛన్లు, రేషన్‌ కార్డులు తదితర దరఖాస్తులు కూడా తీసుకుంటోంది.

ఎవరీ కృష్ణమోహన్‌‌‌‌రావు?
హుజూరాబాద్‌‌‌‌ పట్టణానికి చెందిన వకుళాభరణం కృష్ణమోహన్‌‌‌‌రావు రచయిత. బీసీ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇప్పటికే మూడు సార్లు బీసీ కమిషన్‌‌‌‌ మెంబర్‌‌‌‌గా పని చేశారు. ఉమ్మడి ఏపీలో 2004 నుంచి 2009 వరకు రెండు సార్లు, తెలంగాణలో తొలి కమిషన్‌‌‌‌లో మెంబర్‌‌‌‌ ఉన్నారు. ప్రస్తుతం టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీలో పని చేస్తున్నారు. హుజూరాబాద్‌‌‌‌ నియోజకవర్గ టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అభ్యర్థిగా ఈయన పేరు కూడా వినిపించింది.

సీహెచ్‌‌‌‌ ఉపేంద్ర
సొంతూరు సూర్యాపేట జిల్లాలోని కొత్తపహాడ్‌‌‌‌. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీగల్‌‌‌‌ సెల్‌‌‌‌లో పని చేస్తున్నారు. న్యాయవాద జేఏసీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. ఎంబీసీ సంక్షేమ సమితి వైస్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌గా ఉన్నారు.

శుభప్రధ్‌‌‌‌ పటేల్
వికారాబాద్‌‌‌‌ జిల్లా వ్యక్తి. టీఆర్ఎస్‌‌‌‌లో మొదటి నుంచీ  ఉన్నారు.హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈయన పేరును పరిశీలించారు.

కిశోర్ గౌడ్
సొంత జిల్లా సూర్యాపేట..అంబర్‌‌‌‌పేటలో స్థిరపడ్డారు. 2010–2016 వరకు టీఆర్‌‌‌‌ఎస్వీ స్టేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ సెక్రటరీగా కొనసాగారు.  ప్రస్తుతం ఎంపీ సంతోష్ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో కీలకంగా పని చేస్తున్నారు.