బీఆర్ఎస్లో మహిళా సాధికారత కవితకు మాత్రమే : వనతి శ్రీనివాసన్

బీఆర్ఎస్లో మహిళా సాధికారత కవితకు మాత్రమే : వనతి శ్రీనివాసన్

బీఆర్ఎస్లో మహిళా సాధికారత.. కవితకు మాత్రమే
బీజేపీలో సాధారణ మహిళ సైతం ఉన్నత స్థానానికి ఎదుగుతుంది : వనతి శ్రీనివాసన్
మోదీ స్కీమ్​లతో మహిళ ఆత్మవిశ్వాసం పెరిగిందని వెల్లడి

ఎల్బీ నగర్, వెలుగు : మహిళా సాధికారత అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక్క కల్వకుంట్ల కవితకు మాత్రమేనని బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ విమర్శించారు. బీజేపీలో సాధారణ మహిళ సైతం ఉన్నత స్థానానికి ఎదుగుతుందని చెప్పారు. ఇదివరకు తండ్రి, కొడుకు, భర్త ఏ పార్టీకీ ఓటు వేయమని చెబితే మహిళ ఆ పార్టీకి ఓటు వేసేదన్నారు. అయితే మోదీ ప్రధాని అయ్యాక మహిళల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టడంతో వారిలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. 

ఇప్పుడు ఎవరికి ఓటు వెయ్యాలో మహిళలే చెబుతున్నారని తెలిపారు. మంగళవారం నాగోల్​లోని శుభం గార్డెన్​లో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వనతి శ్రీనివాసన్​ మాట్లాడుతూ.. బీజేపీ కుటుంబాన్ని చూసి పదవులు ఇవ్వదని.. దేశంలో మొట్టమొదటి సారిగా ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసిందన్నారు. అక్టోబర్​లో ప్రతి జిల్లాలో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించాలని తెలిపారు. 

కొత్త ఓటర్లు కనీసం వెయ్యి మందికి తగ్గకుండా యువతి సమ్మేళనాలు నిర్వహించాలని చెప్పారు. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి మహిళా మోర్చా నాయకులంతా కష్టపడి పని చేయాలని తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.  విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, డ్రగ్స్, గంజాయి వల్ల క్రైమ్ పెరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్, నళిని, ఆకుల విజయ, గీతా రాణి దితరులు పాల్గొన్నారు.