
ఇంగ్లండ్‌తో ఆడే ఇండియా వన్డే జట్టుకు ఎంపిక
కుల్దీప్, సుందర్‌లో ఒకరిపై వేటు!
చాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడే చాన్స్
నాగ్‌పూర్: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో టీమిండియా సెలెక్టర్లు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో దుమ్మురేపిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఇండియా వన్డే జట్టులో చేర్చారు. ఇంగ్లండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు అతన్ని తీసుకున్నట్లు బీసీసీఐ మంగళవారం వెల్లడించింది. దీంతో టీమ్‌తో పాటు తొలి వన్డే వేదికైన నాగ్‌పూర్‌కు వచ్చిన వరుణ్.. గంట పాటు నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు.
టీ20 సిరీస్‌లో 14 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన వరుణ్.. వన్డే సిరీస్‌లోనూ రాణిస్తే మరో ప్రమోషన్ కూడా దక్కే చాన్స్ ఉంది. ఫామ్‌ను కంటిన్యూ చేయడానికే వన్డే జట్టులో చేర్చామని బోర్డు చెబుతున్నా.. ఇంగ్లండ్‌పై మళ్లీ చెలరేగితే డైరెక్ట్‌గా చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 12 వరకు చాంపియన్స్ జట్టులో మార్పులు చేర్పులకు చాన్స్ ఉంది.
అరంగేట్రం ఖాయమేనా?
టీ20ల్లో రాణిస్తున్న వరుణ్‌ను వన్డేల్లోనూ అరంగేట్రం చేయించాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. దీనికి ఇంగ్లండ్‌తో సిరీసే సరైన వేదికని భావిస్తున్నారు. ఈ సిరీస్‌లోనూ వరుణ్ సత్తా చాటితే చాలా సమస్యలకు జవాబులు లభిస్తాయని అంచనాలు వేస్తున్నారు. అయితే ఇంగ్లండ్‌తో సిరీస్‌లో వరుణ్‌ను ఆడించాలంటే కుల్దీప్, వాషింగ్టన్ సుందర్‌లో ఒకర్ని తప్పించాలి.
మరి ఇది సాధ్యమేనా? వరుణ్ ఫామ్‌ను అంచనా వేయడానికి ఈ మూడు మ్యాచ్‌లు సరిపోతాయా? అన్నది కాస్త ఆలోచించాల్సిన విషయం. హెర్నియా సర్జరీ నుంచి కోలుకున్న కుల్దీప్ ఫామ్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇక సుందర్ ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్నాడు. కాబట్టి సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
గంభీర్ కోరిక మేరకే
వాస్తవంగా చాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన జట్టులో నలుగురు స్పిన్నర్లు జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్, సుందర్ ఉన్నారు. అయితే వీళ్లలో ఎవరినైనా తప్పించి వరుణ్‌ను తీసుకుంటే చాలా లాభాలుంటాయని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడు. మిస్టరీ బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్లను భయపెట్టడంతో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌లాంటి స్టార్లకు స్పిన్ ప్రాక్టీస్ పెరుగుతుందని ఆశిస్తున్నాడు. వీళ్లు నెట్స్‌లో వరుణ్‌ను దీటుగా ఎదుర్కొంటే చాంపియన్స్‌లోనూ కచ్చితమైన ప్రభావం చూపిస్తారని అంచనా. అయితే కెరీర్‌లో ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడని వరుణ్‌ను డైరెక్ట్‌గా చాంపియన్స్ ట్రోఫీలో ఆడిస్తే విమర్శలు వస్తాయి.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆడించి ఆ తర్వాత చాంపియన్స్ ఫ్లైట్ ఎక్కించాలని ప్లాన్స్ వేస్తున్నారు. అయితే ఇదంతా జరగాలంటే మూడు మ్యాచ్‌ల్లో వరుణ్ సత్తా చాటాలి. కానీ వరుణ్‌కు పేలవమైన బ్యాటింగ్ రికార్డు ఉండటం మైనస్‌గా మారొచ్చు.
లోయర్ ఆర్డర్‌లో కనీసం కొన్ని రన్స్ చేసే బ్యాటర్లకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఈ లెక్కన జడేజా, అక్షర్, సుందర్ బాగా బ్యాటింగ్ చేస్తారు. అవసరమైనప్పుడు కుల్దీప్ కూడా బ్యాట్ ఝుళిపిస్తాడు. దీంతో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ నిలకడ చూపితేనే వరుణ్‌కు చాన్స్ రావొచ్చు. అయితే టీమిండియా బౌలింగ్ కూర్పు మొత్తం బుమ్రా ఫిట్‌నెస్‌పైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. ప్రస్తుతానికి తొలి రెండు వన్డేలకు రెస్ట్ ఇచ్చిన అతన్ని మూడో మ్యాచ్‌కే పరిమితం చేశారు. ఒకవేళ బుమ్రా ఫిట్నెస్ అంశం ‘చాంపియన్స్’పై కూడా ప్రభావం చూపే చాన్స్ ఉంది.