రాజస్థాన్‌ సీఎం ఎంపికపై ఉత్కంఠ.. జేపీ నడ్డాతో రాజే భేటీ

రాజస్థాన్‌ సీఎం ఎంపికపై ఉత్కంఠ.. జేపీ నడ్డాతో రాజే భేటీ

రాజస్థాన్‌కు బీజేపీ సీఎం ఎంపికపై ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకురాలు, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 6న రాత్రి ఆమె న్యూఢిల్లీ చేరుకున్నారు. పార్టీ హైకమాండ్‌లోని ఇతర నేతలను కూడా ఆమె కలుస్తారని సమాచారం.

కొత్తగా ఎన్నికైన 60 మంది బీజేపీ ఎమ్మెల్యేలు డిసెంబర్ 4, 5తేదీల్లో వసుంధర రాజే నివాసంలో ఆమెను కలిసిన తర్వాత ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి పేరును పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని, అంతకు ముందు బీజేపీ శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాచు చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే శాసనసభా పక్ష సమావేశానికి సంబంధించి పార్టీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజే ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారు. డిసెంబర్ 3న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 115 సీట్లు రాగా, కాంగ్రెస్‌కు 69 సీట్లు వచ్చాయి. రాష్ట్రంలోని 200 స్థానాలకు గానూ 199 స్థానాలకు నవంబర్ 25న ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ అభ్యర్థి మృతితో ఎన్నికలు వాయిదా పడిన కరణ్‌పూర్‌లో జనవరి 5న పోలింగ్‌ నిర్వహించి, జనవరి 8న ఫలితాలు వెల్లడించనున్నారు.