
మనం రోజూ తీసుకునే ఆహారంలో కూరగాయల స్థానం ఏంటీ….? ఆకు కూరలు, కూరగాయలను తినాల్సిన మోతాదులో తీసుకుంటున్నామా… ? వీటిపై ఏటా పెడుతున్న ఖర్చు ఎంత? హైదరాబాద్ వాసులు వీటి గురించి పట్టించుకుంటున్నారా…? రాష్ట్రంలోని ఇతర నగరాల ప్రజల మెనూలో వెజిటబుల్స్ కి ఎంత వరకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మన దగ్గర పండే కూరగాయలు సరిపోతున్నాయా…. ఇలా ఎన్నో అంశాలపై సర్వే చేసింది ఆచార్య జయశంకర్ వర్సిటీ.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సిటీలో కూరగాయల వినియోగం బాగా పెరుగుతోంది. మొత్తం 40 రకాల వెజిటేబుల్స్ ఉంటే…. ఇందులో మన మార్కెట్లలో 20 వరకు దొరుకుతున్నాయి. మిగిలిన వాటిని సీజన్ బట్టి బయటి ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నారు వ్యాపారులు. ఐదారేళ్ల నుంచి మాంసాహారం కంటే ఆకుకూరలు, కూరగాయలపైనే నగర వాసులు ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారని ఉద్యానవన శాఖ అధికారులు అంటున్నారు.
మన మెనూలో ఎంత మోతాదులో ఆకుకూరలు, కూరగాయలున్నాయి. మన దగ్గర ఎంత ఉత్పత్తి అవుతున్నాయి. బయటి నుండి వస్తున్నదెంత అనే అంశాలపై జయశంకర్ వర్సిటీ అధ్యయనం చేసింది. నగరాల్లో వెజిటేబుల్స్ వినియోగం పెరిగిందని తేలింది. రాష్ట్రంలో సరాసరి ఒక్కో వ్యక్తి ఏటా కూరగాయలపై 7 వేల 200 రూపాయలు ఖర్చుచేస్తున్నారని, రాబోయే రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు.
రాజధానికి రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ జిల్లాల నుంచి ఆకుకూరలు, కూరగాయలు వస్తున్నాయి. వేసవిలో కర్నాటక, మహారాష్ట్ర నుండి దిగుమతి అవుతున్నాయి. ఇందులో ప్రతీ రోజూ హైద్రాబాద్ నగరానికి 2 వేల 6 టన్నుల వరకు వెజిటేబుల్స్ అవసరం అవుతున్నాయి. నగరాల్లో ధరలు పెరిగినా సరే కూరగాయలపై వినియోగం తగ్గడం లేదని అధ్యయనంలో తేలింది. ఒక్క హైద్రాబాద్ లోనే రోజుకు 3 కోట్ల రూపాయలు వెజిటేబుల్స్ పై ఖర్చు చేస్తున్నారని చెబుతున్నారు అధికారులు. జీహెచ్ఎంసీలో 23 లక్షల కుటుంబాలున్నాయి. జనాభా సుమారు కోటి పైనే. బల్దియా పరిధిలో నెలకు సుమారు 100 కోట్ల రూపాయల వరకు కూరగాయలపై జనం ఖర్చు చేస్తున్నారు. హైద్రాబాద్ నగరానికి నెలకు 60 వేల 182 మెట్రిక్ టన్నులు, యేటా 7 లక్షల 22 వేల 186 మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం. వీటిలో 32 వేల 823 మెట్రిక్ టన్నుల వెజిటేబుల్స్ మహారాష్ట్ర, కర్నాటక నుంచి దిగుమతి అవుతున్నాయి.
వరంగల్ నగరంలో సుమారు 11 లక్షల జనాభా ఉంది. ఇక్కడ రోజుకు 237 మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం. నెలకు 7 వేల 101 మెట్రిక్ టన్నులు, యేటా 85 వేల 209 మెట్రిక్ టన్నుల వెజిటేబుల్స్ అవసరం ఉంటుంది. ఇంకా 25 వేల 936 మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం అవుతాయి. కరీంనంగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 7 లక్షలకు పైగా జనాభా ఉంది. వీరికి రోజుకు 124 మెట్రిక్ టన్నుల వెజిబేటుల్స్ అవసరం. నెలకు 3 వేల 720 మెట్రిక్ టన్నులు, యేటా 44 వేల 632 మెట్రిక్ టన్నులు కావాల్సి ఉంటుంది. కరీంనగర్ వాసులకు యేటా 22 వేల మెట్రిక్ టన్నుల కూరగాయల కొరత ఉంది. అన్ సీజన్లో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
నిజాబాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మూడు లక్షలకు పైగా జనాభా ఉండగా ఇక్కడ రోజుకు 76 మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం అవుతున్నాయి. 4 వేల మెట్రిక్ టన్నుల వెజిటేబుల్స్ కొరత ఉంది. మిగతా కార్పొరేషన్లతో పోల్చితే ఇక్కడ కూరగాయల లభ్యత, వినియోగం బాగానే ఉంది. ఖమ్మం టౌన్లో 3 లక్షలకు పైగా జనాభా ఉంది. ఇక్కడ రోజుకు 57 మెట్రిక్ టన్నుల ఆకుకూరలు, కూరగాయలు అవసరం అవుతాయి. ఇక్కడ సీజన్లో ఫర్వాలేదనుకున్నా 15 వేల మెట్రిక్ టన్నుల వెజిటేబుల్స్ కొరత ఉంది.
వేసవిలో మన దగ్గర కూరగాయలు అంతగా పండిచడం లేదు. దీంతో ధరలు బాగా పెరుగుతున్నాయి. కర్నాటక, మహారాష్ట్ర నుండి దిగుమతి తప్పనిసరి. ఇందులో ప్రధానంగా ఉల్లిగడ్డలు, క్యాప్సికం, ఆలు గడ్డలున్నాయి. యేటా వేసవిలో డిమాండ్ కు సరిపడా కూరగాయలు పండించలేకపోతున్నారు రైతులు. ఉత్పత్తి చేసిన వాటిని నిల్వ చేసుకునే సౌకర్యాలు కూడా అంతగా లేవు. కూరగాయల సాగుకు అవసరమైన నీటి వనరులూ లేవు. దాంతోపాటు ధరల్లో హెచ్చు తగ్గులుండటం వల్ల రైతులు కూరగాయల సాగుపై అంతగా దృష్టి పెట్టడం లేదని చెప్తున్నారు జయశంకర్ వర్సిటీ అధికారులు. పెట్టుబడి ఎక్కువ, లాభం తక్కువ… 6 నెలల పాటు వాతావరణమూ అనుకూలించని కారణంగా రైతులు వీటిని పండించడం లేదని అధ్యయనంలో తేలింది.