- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 95 లక్షలకుపైగా వెహికల్స్
- నిబంధనలు పాటించని సర్వీసింగ్ సెంటర్లు స్టీమ్ వాషింగ్, వాటర్ లెస్,
- డ్రై వాష్లాంటి ఆధునిక పద్ధతులు వచ్చినా అప్డేట్ కావట్లే
- వాహనదారుల ఆలోచనా విధానంలో మార్పు రావాలంటున్న ఎక్స్పర్ట్స్
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వెహికల్స్ కడిగేందుకు కోట్లాది లీటర్ల గ్రౌండ్వాటర్ను వృథా చేస్తున్నారు. నీటి కొరత ఉన్నా పట్టించుకోకుండా యథేచ్ఛగా బండ్లకు వాటర్ వాష్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్లో 95 లక్షలకు పైగా వివిధ రకాల వెహికల్స్ ఉన్నాయి. ఇందులో 65 లక్షల టూ-వీలర్లు, 16 లక్షలకుపైగా కార్లు, వీటితోపాటు లారీలు, ఇతర ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, సిటీ ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు లక్షల్లో ఉన్నాయి. పెరుగుతున్న వాహనాలకు తగ్గట్టుగా సిటీలో వాటర్ సర్వీసింగ్ కేంద్రాలు విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం సిటీవ్యాప్తంగా 3 వేల నుంచి 5 వేల దాకా ఆటోమొబైల్ సర్వీసింగ్ సెంటర్లు, ఇంకా కార్, బైక్ వాషింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 95 లక్షల వాహనాల్లో ప్రతిరోజూ అన్ని వాహనాలను కడగకపోయినప్పటికీ, సర్వీసింగ్ సెంటర్లలో, ఇండ్లు, కమర్షియల్ కాంప్లెక్స్లలో నిత్యం జరిగే వాటర్ వాష్ల వల్ల ప్రతిరోజూ సుమారు 15 కోట్ల నుంచి 20 కోట్ల లీటర్ల నీరు వృథా అవుతోందని అంచనా.
కారు కడిగేందుకు 200 లీటర్లు..
ప్రస్తుతం ఉన్న హై-ప్రెజర్ వాషింగ్ పద్ధతి వల్ల బైక్ను కడగడానికి 20 నుంచి 30 లీటర్లు, కారుకు 150 నుంచి 200 లీటర్లు, లారీ లేదా బస్సుకు ఏకంగా 400 లీటర్లకు పైగా నీరు ఖర్చవుతున్నది. ఇందులో ఎక్కువ భాగం భూగర్భ జలాలు కావడంతో నగరంలో నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. నిజానికి అభివృద్ధి చెందిన దేశాల్లో నీటి వృథాను అరికట్టేందుకు ఆధునిక టెక్నాలజీతో కూడిన ‘స్టీమ్ వాషింగ్’ అందుబాటులోకి వచ్చింది. మన దగ్గరా పలుచోట్ల వీటిని వాడుతున్నారు. ఈ స్టీమ్వాషింగ్ద్వారా కేవలం 3 నుంచి 5 లీటర్ల నీటితో కారును మెరిపించవచ్చు. ఇంకా నీటి చుక్క కూడా అవసరం లేని ‘వాటర్ లెస్/డ్రై వాష్’ పద్ధతిలో ప్రత్యేకమైన ఎకో-ఫ్రెండ్లీ స్ప్రేలు, మైక్రోఫైబర్ క్లాత్లు ఉపయోగించి వాహనానికి ఎలాంటి గీతలు పడకుండా శుభ్రం చేయవచ్చు.
వాడిన నీటిని మళ్లీ శుద్ధి చేసి వాడే రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటుచేసుకునే అవకాశమున్నా.. సర్వీస్ సెంటర్లు నిర్లక్ష్యం చేస్తున్నాయి. కేవలం నీటి వృథాతోనే ఈ సమస్య ఆగిపోవడం లేదు. సర్వీసింగ్ సెంటర్ల నుంచి వెలువడే వ్యర్థ జలాల్లో ఇంజిన్ ఆయిల్స్, గ్రీజు, షాంపూల రసాయనాలు ఉంటున్నాయి. ఈ నీటిని శుద్ధి చేయకుండా నేరుగా మురుగు కాలువలు, చెరువుల్లోకి వదలడంతో సమీపంలోని భూగర్భ జలాలు విషతుల్యమవుతున్నాయి. ఎల్నినో పరిస్థితుల్లో నీటిని పొదుపుగా వాడుకోవాలని సీఎం సైతం సూచిస్తున్న తరుణంలో వాటర్ సర్వీసింగ్ సెంటర్లలో నీటి వృథాపై అధికారులు దృష్టి సారించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో వాహనదారుల ఆలోచనా విధానంలో మార్పు రావాలని, ఇంట్లోనే తడి గుడ్డతో డ్రై వాషింగ్ కిట్లతో వాహనాలను క్లీన్ చేసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
