
భారతదేశంలోని ప్రధాన శివాలయాల్లో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ఇక్కడ ప్రధాన దైవమైన శివుడిని భక్తులు ‘రాజన్న’ అని ప్రేమగా పిలుచుకుంటారు ఇక్కడ లభించిన శాసనాలనుబట్టి చాళుక్య వంశంలోని ఒక శాఖయైన ‘వేములవాడ చాళుక్యులు’ క్రీ.శ 750 నుంచి క్రీ.శ 973 వరకు వేములవాడను రాజధానిగా చేసుకుని పాలించారని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి.
భారతదేశంలోని ఏ శివాలయంలో లేనివిధంగా కోడెను కట్టే సంప్రదాయం వేములవాడలో ఉంది. శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి వచ్చే భక్తులలో సంతానం లేని అనేకమంది ధర్మగుండలో స్నానమాచరించి తడిబట్టలతో ఆలయం చుట్టూ కోడెలను తిప్పి, రాజన్న పేరును తలచుకుని తమ మొక్కులను తీర్చుకుంటారు. ఈ ఆలయంలో నిత్యం ప్రత్యేక పూజలు జరుగుతాయి. శివరాత్రి రోజున సుమారు వందమంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతారు. అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు.
దేవాలయ పునర్నిర్మాణం
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2015 జూన్ 18న నాటి సీఎం కేసీఆర్ వేములవాడను సందర్శించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. 2019 డిసెంబర్ 30న మూడోసారి వేములవాడ వచ్చిన కేసీఆర్ చెరువు శిఖం భూములను తీసుకుని 37 ఎకరాలకు ఆలయాన్ని విస్తరించాలని ఆలయ అధికారులను ఆదేశించారు. వేములవాడ పట్టణం, రాజన్న ఆలయ సమగ్రాభివృద్ధి చేసేలా వేములవాడ దేవాలయ ఏరియా అభివృద్ధి ప్రాధికార సంస్థ (వీటీడీఏ)ను ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్గా కేసీఆర్, వైస్ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ ముద్దసాని పురుషోత్తంరెడ్డి వ్యవహరించారు. వీటీడీఏ ద్వారా భూసేకరణ, రహదారుల విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించారు. దేవాలయ విస్తరణ కోసం శృంగేరి పీఠాధిపతి వద్దకు వెళ్లి అభివృద్ధి నమూనాలను సేకరించారు. 2022 ఏప్రిల్ 4న స్థపతి ఆనంద్ సాయి ఈ ఆలయాన్ని సందర్శించి అధికారులతో చర్చించి ఈ ప్రాంతాన్ని పాలించిన చాళుక్యులు, కాకతీయ వైభవం ఉట్టిపడేలా
రాజన్న ఆలయ అభివృద్ధి నమూనాలను రూపొందిస్తామన్నారు.
45 ఏండ్ల తరువాత విస్తరణ పనులు
వేములవాడ రాజన్న ఆలయంలో 1979లో జరిగిన పనులే తప్ప, మళ్లీ ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. రాజన్న ఆలయానికి భక్తుల సంఖ్య పెరగడం, ఆలయం ఇరుకుగా ఉండడంతో కొన్నేళ్లుగా భక్తులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తుల ఇబ్బందులను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.76కోట్లు విడుదల చేసింది. ఈ పనులకు గతేడాది నవంబర్ 20న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
సరికొత్తగా ఆలయం
శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులను జూన్ 15 నుంచి రాష్ర్ట ప్రభుత్వం ప్రారంభించింది. దీనికోసం రూ.47 కోట్లను మంజూరు చేయడంతోపాటు బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించారు. పనులను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. శృంగేరి పీఠాధిపతుల సూచనలతో భక్తిభావం విరాజిల్లేలా ఆలయ సంప్రదాయానికి, శిల్పకళ సౌందర్యానికి నిదర్శనంగా ఆలయ రూపురేఖలను మార్చనున్నారు. పుష్కరిణి చుట్టూ ఉద్యానవనం, మధ్యలో శివుని విగ్రహం, నడక మార్గాలు, కోటిలింగాలు, ఆలయ ప్రాంగణంలోని ఆలయాలు, భక్తులకు అన్ని సౌకర్యాలు, వసతులు ఉండేలా సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు.
ఆధ్యాత్మిక కేంద్రం దిశగా...
వేములవాడ ఆలయాన్ని చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలి. ఈ ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని అంచనావేస్తూ, భవిష్యత్ రద్దీని తట్టుకునేలా ఏర్పాట్లను రూపొందించి, తగిన ప్రణాళికలను అమలుచేయాలి. భక్తుల రద్దీకి అనుగుణంగా వసతి గృహాలు, పార్కింగ్ సౌకర్యం, క్యూ కాంప్లెక్స్, బతుకమ్మ పండుగ నిర్వహణకు సాంస్కృతిక వేదిక, ఆలయ సుందరీకరణ, విస్తరణ, గుడి చెరువులో బోటింగ్, సాంస్కృతిక జోన్ మొదలైన మౌలిక సౌకర్యాల అభివృద్ధి సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలుచేయాలి. భక్తుల విడిదికి అవసరమైన వసతి సౌకర్యాలను కల్పిస్తే, ఆలయానికి ఆదాయం పెరగడమేకాకుండా, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. వేములవాడ పట్టణంలోని ప్రధాన బస్టాండ్, భవిష్యత్తులో రాబోతున్న రైల్వేస్టేషన్ నుంచి దేవాలయానికి అనుసంధానమయ్యే రోడ్లు, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా రోడ్లకిరువైపులా పచ్చదనం వెల్లివిరిసేలా మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరగాలి.
మ్యూజియం ఏర్పాటు చేయాలి
వేములవాడ ప్రాంతాన్ని పాలించి శాతవాహనులు, చాళుక్యుల కాలంనాటి చారిత్రక ఆధారాలను, శిథిలమైన విగ్రహాలను, శాసనాలను భద్రపరిచేందుకు ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలి. వేములవాడలో టీటీడీ తరహాలో అన్నదాన సత్రం అందుబాటులోకి తేవాలి. ధర్మ ప్రచార పరిషత్ ఏర్పాటుచేసి పండితులు, ఆధ్యాత్మిక గురువులు, చరిత్ర పరిశోధకులకు, విద్యావంతులకు ధర్మ పరిరక్షణలో భాగస్వామ్యం కల్పించాలి. హైదరాబాద్, భవిష్యత్లో అందుబాటులోకి రానున్న వరంగల్ విమానాశ్రయాలను అనుసంధానిస్తూ వేములవాడలో ఏరోడ్రోమ్ నిర్మాణానికి కృషి చేయాలి. ఈక్రమంలో హెలి టూరిజంను అభివృద్ధికి కృషి చేయాలి. వేములవాడలో హెలిప్యాడ్ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలి. హెలి టూరిజం వల్ల వేములవాడ పట్టణం, నాంపల్లి గుట్ట, మిడ్మానేరు జలాశయాల అందాలను వీక్షించే అవకాశం కలుగుతుంది.
-గుడెల్లి అశోక్,
జూనియర్ లెక్చరర్