- 3 వేల మందికి పైగా గాయాలు
- శిథిలాల కింద చిక్కుకున్న ఆప్తుల ఆర్తనాదాలు
- తమవారికోసం చేతులతోనే మట్టిని,
- కాంక్రీట్ శిథిలాలను తొలగిస్తున్న ప్రజలు
- వివిధ దేశాల సాయం..
- కొనసాగుతున్న సహాయక చర్యలు
కరాకాస్/న్యూఢిల్లీ:వరుస భూకంపాలతో ఉత్తర వెనెజువెలా అతలాకుతలమైంది. బుధవారం రాత్రి కొన్ని గంటల వ్యవధిలోనే సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాల ధాటికి వందలాది భవనాలు పేకమేడల్లా కూలిపోయిన విషయం తెలిసిందే. శిథిలాల కింద చిక్కుకున్న తమ వారిని కాపాడుకునేందుకు స్థానికులు చేతులతోనే మట్టిని, కాంక్రీట్ శిథిలాలను తొలుస్తూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ ఘోర విపత్తులో ఇప్పటివరకూ 920 మంది మరణించినట్టు ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ శుక్రవారం ప్రకటించారు.
మొత్తం 3,360 మంది గాయపడ్డారని తెలిపారు. వేలాది మంది గల్లంతైనట్టు చెప్పారు. వివిధ దేశాలనుంచి వచ్చిన రెస్క్యూ (సహాయక) బృందాలకు స్వాగతం పలుకుతూ, ప్రభుత్వం, సైనిక అధికారుల సమక్షంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘భవన శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను మేం రక్షిస్తాము.
ఈ పని కోసం అలుపెరగకుండా శ్రమిస్తున్నాం” అని పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం సంభవించిన 7.2, 7.5 తీవ్రత కలిగిన ఈ భూకంపాల వల్ల ‘లా గుయైరా’ రాష్ట్రం అత్యంత తీవ్రంగా ప్రభావితమైందని ఆమె తెలిపారు. అక్కడ ప్రాణాలతో ఉన్నవారి కోసం గాలింపు చర్యలు చేపట్టడానికి, అలాగే ఆహారం, నీరు పంపిణీ చేయడానికి ఆ ప్రాంతాన్ని సైన్యం ఆధీనంలోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఈ భూకంపాలు వెనెజువెలా చరిత్రలో శతాబ్ద కాలంలో ఎన్నడూ చూడని అతిపెద్ద విపత్తుగా నిలిచాయి. భూకంప కేంద్రం మోరోన్ సమీపంలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. లోతు తక్కువగా ఉండటం, పైగా ఒకదాని వెనుక ఒకటి 2 సార్లు భూమి కంపించడంతో ధ్వంసమైన తీవ్రత ఊహకందని స్థాయికి చేరింది.
శ్మశానాన్ని తలపిస్తున్న తీరప్రాంతం
రాజధాని కారకాస్‌కు ఉత్తరాన ఉన్న ‘లా గుయైరా’ తీరప్రాంతం ఈ భూకంప ధాటికి పూర్తిగా ఛిన్నాభిన్నమైంది. ఇక్కడి ప్రధాన విమానాశ్రయం దెబ్బతినడంతో దాన్ని మూసివేశారు. ఫలితంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఎటు చూసినా అస్థిపంజరాల్లా మారిన భవనాలు, రోడ్లపై పడ్డ బీటలు, కుప్పకూలిన ఇళ్లతో ఆ ప్రాంతమంతా శ్మశానాన్ని తలపిస్తోంది.
ఉత్తర వెనెజువెలావ్యాప్తంగా గుండెలవసే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ సహాయక సిబ్బంది చేరని ప్రాంతాల్లో స్థానికులు తమ చేతులతోనే శిథిలాలను తొలుస్తూ తమ వారి కోసం వెతుకుతున్నారు. అంపారో డెల్ గియుడిస్ అనే మహిళ తన కుమారుడి కోసం కాంక్రీట్ శిథిలాలను చేతులతోనే తవ్వుతూ రోదిస్తున్న దృశ్యాలు స్థానికులను కన్నీరు పెట్టిస్తున్నాయి.
ఎటుచూసినా పిల్లల కోసం వెదుకుతున్న తల్లిదండ్రులు.. తల్లిదండ్రులు కనిపించకపోవడంతో చిన్నారుల ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. ఈ మహా విషాదంలోనూ కొన్ని అద్భుతాలు చోటుచేసుకున్నాయి. లా గుయైరాలో ‘ప్యాన్‌కేక్’ లాగా ఫ్లాట్‌గా మారిపోయిన 10 అంతస్తుల భవన శిథిలాల నుంచి ఒక చిన్నారిని రక్షక సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. అలాగే కారాకాస్‌లో ఓ యువకుడిని ప్రాణాలతో వెలికితీయడంతో అక్కడున్న వారంతా చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు.
కదలివచ్చిన అంతర్జాతీయ సమాజం
వెనెజువెలా విపత్తుపై అంతర్జాతీయ సమాజం వేగంగా స్పందించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెస్క్యూ టీమ్‌లు అక్కడికి చేరుకుంటున్నాయి. వేలాది మంది గల్లంతైన నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్లను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ.. తాము పెద్ద ఎత్తున, అత్యంత వేగంగా సహాయక చర్యలు అందిస్తామని ప్రకటించారు. చిలీ, మెక్సికో, ఎల్ సాల్వడార్, డొమినికన్ రిపబ్లిక్ రక్షక దళాలు, సామగ్రి పంపించాయి. టర్కీ, బ్రెజిల్, ఖతార్, స్పెయిన్, కెనడా ప్రత్యేక విమానాల్లో సహాయక బృందాలను పంపనున్నట్టు ప్రకటించాయి..
వెనెజువెలాకు సాయం కోసం..భారత్ ‘ఆపరేషన్ అమిస్టాడ్(ఫ్రెండ్షిప్)’
భూకంప విపత్తుతో విలవిల్లాడుతున్న వెనెజువెలా దేశాన్ని ఆదుకునేందుకు భారత్ ‘ఆపరేషన్ అమిస్టాడ్(ఫ్రెండ్షిప్)’ను శుక్రవారం ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన రెండు భారీ ‘సీ-17’ గ్లోబ్‌మాస్టర్ రవాణా విమానాలు 35 టన్నులకుపైగా సహాయక సామాగ్రి, అత్యాధునిక ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్‌తో వెనెజువెలాకు బయలుదేరాయి.
ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. వెనెజువెలాలో వైద్య సేవలు అందించేందుకు భారత సైన్యానికి చెందిన ‘60 పారా ఫీల్డ్ హాస్పిటల్’ నిపుణుల బృందం హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రయాణమైంది. ఈ ప్రత్యేక బృందంలో 9 మంది సీనియర్ మెడికల్ ఆఫీసర్లతో పాటు మొత్తం 41 మంది సైనిక వైద్య సిబ్బంది ఉన్నారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ సమకూర్చిన 6 టన్నుల అత్యవసర మందులు, వైద్య పరికరాలు కూడా వీరి వద్ద ఉన్నాయి. అలాగే, భారత్ పంపుతున్న ఈ సహాయక సామాగ్రిలో ‘భీష్మ్ క్యూబ్’ (భారత్ ఇన్షియేటివ్ ఫర్ సహ్యోగ్, హితా అండ్ మైత్రి) మొబైల్ ఆసుపత్రి కూడా ఉంది. ఇది చాలా తక్కువ సమయంలో, ఎక్కడైనా సులభంగా ఏర్పాటు చేయగల ఒక మినీ ఫీల్డ్ హాస్పిటల్‌గా సేవలు అందిస్తుంది.
