రాజ్యసభ కొత్త చైర్మన్​గా బాధ్యతలు స్వీకరించిన ఉపరాష్ట్రపతి

రాజ్యసభ కొత్త చైర్మన్​గా బాధ్యతలు స్వీకరించిన ఉపరాష్ట్రపతి
  • సభా వేదిక వరకు తీసుకెళ్లిన ప్రధాని
  • సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామన్న ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ: రాజ్యసభ కొత్త చైర్మన్​గా ఉపరాష్ట్రపతి జగ్​దీప్​ ధన్​కర్​ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంట్​ శీతాకాల సమావేశల తొలిరోజు.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఇతర నేతలు ధన్​కర్​ను చైర్మన్​ సీటు వరకు తీసుకుని వెళ్లారు. పలు పార్టీలకు చెందిన ఎంపీలు ఈ సందర్భంగా ధన్​కర్​కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను ధన్​కర్​ కొనసాగిస్తారని అధికార పార్టీ సభ్యులు ఆశాభావం వ్యక్తంచేశారు. చిన్న పార్టీలకు మరింత సమయం ఇవ్వాలని, ప్రభుత్వ బిల్లుల స్క్రూటినీ కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను బలోపేతం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్​ చేశాయి. లోక్​సభ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఇటీవల మరణించిన సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్, 8 మంది మాజీ సభ్యులకు లోక్​సభ నివాళులర్పించింది. ద మల్టీ స్టేట్​ కో ఆపరేటివ్ సొసైటీస్(అమెండ్​మెంట్) బిల్లు, 2022ను ప్రభుత్వం లోక్​సభలో ప్రవేశపెట్టింది.

లీగల్​ అంశాలపై ధన్​కర్​కు పట్టుంది: మోడీ

ధన్​కర్​కు స్వాగతం పలుకుతూ ప్రధాని మోడీ ఉపన్యాసం చేశారు. రాజ్యసభ చైర్మన్‌‌గా ధన్​కర్ ప్రజాస్వామ్య విలువలను కాపాడతారని విశ్వాసం వ్యక్తంచేశారు. ఆయన ఒక రైతు కొడుకని, సైనిక స్కూల్​లో చదువుకున్నారని చెప్పారు. ధన్​కర్​కు లీగల్​ అంశాలపై ఎంతో పట్టుఉందన్నారు. ఎంతో మందికి ఆయన స్ఫూర్తి అని కొనియాడారు. సభ సజావుగా సాగేందుకు అండగా ఉంటామని ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌‌ చీఫ్​  మల్లికార్జున్‌‌ ఖర్గే హామీ ఇచ్చారు.

లక్ష్మణ రేఖను గౌరవించాలి: ధన్​కర్

రాజ్యసభ చైర్మన్​గా బాధ్యతలు స్వీకరించిన జగదీప్​ ధన్​కర్​ తొలిసారి సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రభుత్వంలోని 3 వ్యవస్థలు ఒకదాని విషయంలో మరొకటి జోక్యం చేసుకుంటే పాలన దెబ్బతింటుందని, అందువల్ల అందరూ ‘లక్ష్మణరేఖ’ను గౌరవించాలని అన్నారు. జడ్జీల నియామకంపై ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య ఇటీవల మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే