చిన్నారి రేప్ ఘటన..సాగర్ హైవేపై ఉద్రిక్తత

చిన్నారి రేప్ ఘటన..సాగర్ హైవేపై ఉద్రిక్తత

హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలిక అనుమానాస్పద మృతితో స్థానికులు ఆందోళనకు దిగారు. గురువారం సాయంత్రం చిన్నారి అదృశ్యమైంది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు వెతకటంతో... పక్కింట్లో  నివసించే రాజు అనే వ్యక్తి ఇంట్లో బాలిక మృతదేహం లభ్యమైంది. బాలికపై రాజు అత్యాచారానికి పాల్పడి హత్య చేసి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. బాలిక మృతితో సైదాబాద్ కాలనీలో వాసులు ఆందోళనకు దిగారు ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులతో కాలనీ వాసులు వాగ్వాదానికి దిగారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. నిందితుడు రాజును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.

నిందితుడు రాజును ఉరి తీయాంటూ సాగర్ హైవేపై కర్మాన్ ఘాట్, చంపాపేట్ రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు బాధిత కుటుంబ సభ్యులు, కాలనీవాసులు. నిందితుడికి ఉరిశిక్ష వేసి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాలనీలో 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఆందోళన చేస్తున్న సింగరేణి కాలనీవాసులను.. హైదరాబాద్ కలెక్టర్ ఎల్ శర్మన్, ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్ రెడ్డి సముదాయించే ప్రయత్నం చేశారు. పాప తల్లిదండ్రులను ఓదార్చారు కలెక్టర్. బాధిత కుటుంబానికి తక్షణ పరిహారం కింద 50 వేల చెక్ అందజేశారు. ప్రభుత్వం తరుఫున ఆదుకుంటామని డబుల్ బెడ్రూం ఇల్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు కలెక్టర్.