దేశం, ధర్మం రెండు కండ్లవంటివి : విదుశేఖర భారతి

దేశం, ధర్మం  రెండు కండ్లవంటివి :  విదుశేఖర భారతి
  •     వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది: విదుశేఖర భారతి

న్యూఢిల్లీ, వెలుగు: “దేశం, ధర్మం భారతీయ సమాజానికి రెండు కళ్లవంటివి. ఈ రెండింటినీ జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది” అని దక్షిణామ్నాయ శృంగేరీ శారదా పీఠం ఉత్తరాధికారి జగద్గురు శ్రీశ్రీశ్రీ విదుశేఖర భారతీ మహాస్వామి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారిక నివాసంలో జరిగిన పాదపూజ అనంతరం ఆయన అనుగ్రహ భాషణం(ఆధ్యాత్మిక ఉపన్యాసం) చేశారు. 

ఈ పాదసేవలో బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా, కేంద్రమంత్రులు సర్బానంద సోనోవాల్, అన్నపూర్ణాదేవి, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్ మాండవీయ, సీఆర్ పాటిల్, సతీశ్ చంద్ర దూబే, ఢిల్లీ మంత్రి ఆశిశ్ సూద్ తోపాటు పలువురు రాజకీయ, సామాజిక, పారిశ్రామిక రంగ ప్రముఖులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా విదుశేఖర భారతీ మాట్లాడుతూ..“వేల ఏండ్ల సనాతన చరిత్ర కలిగిన భారతదేశంలో పుట్టడం ఎన్నో జన్మల అదృష్టం. ఈ దేశానికి సేవ చేయడమే ప్రతి ఒక్కరి ధర్మం. దేశాన్ని గౌరవిస్తూనే ధర్మాన్ని కాపాడుకోవాలి. బాధ్యతతో, కర్తవ్యపాలనతో నడిస్తే ఏ విజయమైనా సాధ్యమే” అని ఆశీర్వచనం చేశారు. 

ఆది శంకరాచార్యులు కేవలం 32 ఏండ్ల జీవితంలోనే వేల ఏండ్లకు అవసరమైన ధర్మజాగరణ చేశారని గుర్తు చేశారు. అదే బాటలో అందరం కలిసి ముందుకు సాగాలని విదుశేఖర భారతీ పిలుపునిచ్చారు.