- ఆవిష్కరించిన విజిలెన్స్ డీజీ శిఖాగోయల్
- ఇకపై తనిఖీలు స్పీడప్, సకాలంలో నివేదికలు
- 27 శాఖల నుంచి యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్
- విజిలెన్స్ సిబ్బందికి ప్రత్యేక జాకెట్లు పంపిణీ
- గత ఏడు నెలల్లో రూ.150 కోట్ల రేషన్ బియ్యం సీజ్
- అక్రమ మైనింగ్, పన్ను ఎగవేతలపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్ పంజా
హైదరాబాద్, వెలుగు: విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వంఆ న్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. మొత్తం 27 శాఖల నుంచి యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్ సేకరించడం, అంతర్గత సమన్వయం కోసం రూపొందించిన ఈ పోర్టల్‌ను విజిలెన్స్ డీజీ శిఖాగోయల్ బుధవారం ప్రారంభించారు. దీంతో పాటు సిబ్బందిని గుర్తించడానికి ప్రత్యేక జాకెట్లను పంపిణీ చేశారు. ఈ మేరకు శిఖాగోయల్ వివరాలు వెల్లడించారు.
ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా విజిలెన్స్ నివేదికలను సకాలంలో సేకరించడంతో పాటు సిబ్బంది పనితీరు మరింత వేగవంతం అవుతుందని వివరించారు. క్షేత్రస్థాయి కార్యకలాపాల సమయంలో సిబ్బందిని గుర్తించడానికి వీలుగా జాకెట్లను అందించామన్నారు. ఏప్రిల్‌లో జరిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడుల వివరాలను డైరెక్టర్ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు.
విజిలెన్స్ దాడులు శాఖల వారీగా
రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల సమన్వయంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిర్వహించిన భారీ తనిఖీల్లో విస్తుపోయే అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మంజీరా నది పరివాహక ప్రాంతంలో సాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై దాడి చేసిన అధికారులు..115 మెట్రిక్ టన్నుల ఇసుకతో పాటు, రవాణాకు ఉపయోగిస్తున్న 9 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ వ్యవహారంలో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రవాణా, గనులు, వాణిజ్య పన్నులు, అటవీ, పౌర సరఫరాల శాఖలు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 920 వాహనాలను తనిఖీ చేశారు. ఇందులో ఓవర్ లోడింగ్, పన్ను ఎగవేత వంటి నిబంధనలను ఉల్లంఘించిన 125 వాహనాలను సీజ్ చేశారు.రేషన్ బియ్యం అక్రమ రవాణాపై జరిపిన దాడుల్లో సుమారు రూ.1.06 కోట్ల విలువైన 5,464 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అలాగే, గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగానికి సంబంధించి 355 నిండు సిలిండర్లు, 723 ఖాళీ సిలిండర్లను సీజ్ చేశారు. హైదరాబాద్ సిటీ, ఓఆర్‌ఆర్ పరిధిలోని 25 ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలలోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 1,200 కంటే ఎక్కువ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఆర్టీఏలో5,000 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్సులు పంపిణీ చేయకుండా ఉన్నట్లు నిర్ధారించారు. రవాణా పన్ను బకాయిలు రూ.80 కోట్లు, గనుల శాఖలో రూ.186 కోట్లు, టీజీఐఐసీ రూ. 55 కోట్లు, లేబర్ లైసెన్స్ వసూళ్లలో రూ.3.17 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీల్లో వెల్లడైంది.
గత ఏడు నెలల్లో ఇలా..
రాష్ట్రవ్యాప్తంగా గత ఏడు నెలలుగా (అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు) ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నిర్వహించిన తనిఖీల్లో భారీగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కాలంలో మొత్తం రూ.256.77 కోట్ల విలువైన అక్రమాలను గుర్తించగా, ఇప్పటికే రూ.62 కోట్లను అధికారులు వసూలు చేశారు. ముఖ్యంగా ఇసుక మైనింగ్‌పై జరిపిన దాడుల్లో 2,830 మెట్రిక్ టన్నుల ఇసుక, 12 ఎక్స్‌కవేటర్లు, 73 వాహనాలను సీజ్ చేసి.. 128 మందిపై 26 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రైస్ మిల్లులు, ఫెయిర్ ప్రైస్ షాపులపై 327 దాడులు నిర్వహించి, సుమారు రూ.150.50 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రవాణా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి 1,679 వాహనాలను తనిఖీ చేయగా.. ఫిట్‌నెస్ , భద్రతా నియమాలు పాటించని 263 వాహనాలకు రూ.47.29 లక్షల జరిమానా విధించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వివిధ విభాగాల్లోని లూప్‌హోల్స్‌ను అరికట్టేందుకు ఈ ఏడు నెలల కాలంలో రాజీలేని పోరాటం చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

