విదర్భ తొలిసారి..విజయ్ హజారే వన్డే ట్రోఫీ సొంతం

విదర్భ తొలిసారి..విజయ్ హజారే వన్డే ట్రోఫీ సొంతం


    విజయ్ హజారే వన్డే ట్రోఫీ సొంతం
    ఫైనల్లో 38 రన్స్ తేడాతో  సౌరాష్ట్రపై గెలుపు

బెంగళూరు: బ్యాటింగ్, బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అదరగొట్టిన విదర్భ తొలిసారి విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాజారే వన్డే ట్రోఫీ సొంతం చేసుకుంది. గతేడాది రన్నరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచిన ఆ జట్టు ఈసారి పట్టుదలగా ఆడి నేషనల్ వన్డే చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. ఓపెనర్ అథర్వ తైడే (128) సెంచరీతో విజృంభించడంతో ఆదివారం జరిగిన ఫైనల్లో 38 రన్స్ తేడాతో రెండుసార్లు చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సౌరాష్ట్రను ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 317/8 స్కోరు చేసింది. సూపర్ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న అథర్వకు తోడు యశ్ రాథోడ్ (54) ఫిఫ్టీతో సత్తా చాటాడు. అమన్ మోఖడే (33) కూడా ఫర్వాలేదనిపించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో అంకుర్ పన్వార్ (4/65) నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారీ టార్గెట్ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సౌరాష్ట్ర 48.5 ఓవర్లలో 279 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. ప్రేరక్ మన్కడ్ (88), చిరాగ్ జానీ (64) పోరాడినా మిగతా బ్యాటర్ల నుంచి సహకారం కరువైంది. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (4/50) నాలుగు, నచికేత్ భుటే (3/46) మూడు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బకొట్టారు. అథర్వ తైడేకు ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అమన్ మోఖడేకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డులు లభించాయి.