రుణాల ఎగవేత కేసు నుంచి తప్పుకున్న మాల్యా అడ్వకేట్

రుణాల ఎగవేత కేసు నుంచి తప్పుకున్న మాల్యా అడ్వకేట్

విజయ్ మాల్యా కేసు నుంచి విముక్తి కల్పించాలని ఆయన తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన మాల్యా ఎక్కడున్నాడో తెలియడం లేదని, ఆయనతో సమాచారం ఇచ్చి, పుచ్చుకోవడం సాధ్యం కావడం లేదని న్యాయవాది ఈసీ అగర్వాలా న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. విజయ్ మాల్యా బ్రిటన్ లో ఉన్నట్టు సమాచారం ఉన్నప్పటికీ  ఆయనతో ప్రస్తుతం ఎలాంటి సంభాషణ గానీ, ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం సాధ్యం కావడం లేదని చెప్పారు. మాల్యా ఈ మెయిల్ అడ్రస్ మాత్రమే తన వద్ద ఉందన్న అగర్వాలా.. ఆయన ఆచూకీ తెలియనందున కేసు వాదించలేదని విన్నవించారు. తనకు కేసు నుంచి విముక్తి కల్పించాలని కోరారు. 

మాల్యా తరఫు న్యాయవాది అభ్యర్థనపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. కేసు నుంచి తప్పుకునేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. విజయ్ మాల్యా ఈ మెయిల్ ఐడీతో పాటు ప్రస్తుత చిరునామాను కోర్టు రిజిస్ట్రీకి అందజేయాలని చెప్పింది. కేసు తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది.

కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ ఏడాది ప్రారంభంలో విజయ్ మాల్యాకు 4 నెలల జైలు శిక్ష విధించింది. మాల్యాను భారత్ కు రప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయనను రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా అవేవీ ఫలించడం లేదు. మాల్యాను భారత్ కు అప్పగించాలని బ్రిటన్ హైకోర్టు 2020 ఏప్రిల్‌లో ఆదేశించినప్పటికీ, రెండున్నరేళ్లు గడిచినా ఆ ఆదేశాలు మాత్రం ఇంకా అమలు కాలేదు.