చెన్నై: విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో శాంతియుతంగా నిరసన తెలిపిన రైతులు, ఉపాధ్యాయులపై నమోదైన కేసులు అన్నింటినీ ఉపసంహరించుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎం విజయ్ బుధవారం (సెప్టెంబర్ 2) అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. 2021, మే నుంచి 2026 మే మధ్య రైతులు, ఉపాధ్యాయులపై నమోదైన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.
ఆ కేసుల వల్ల వారిలో చాలా మంది ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేస్తున్న వారిపై గత డీఎంకే ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించిందని విమర్శించారు. టీవీకే ప్రభుత్వం రైతులు, ఉపాధ్యాయులకు.. వారి న్యాయమైన డిమాండ్లకు అండగా నిలుస్తుందని తెలిపారు.
టీవీకే ప్రభుత్వ చర్య ప్రజాస్వామ్య హక్కులను మరింత బలోపేతం చేయడంతో పాటు, సామాన్య ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య విశ్వాసాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో విద్యార్థులతో సహా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై పెట్టిన కేసులను కూడా ఉపసంహరించుకోవాలని విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని సీపీఐ కోరింది.
ALSO READ : తెలంగాణలో విమానాశ్రయాల పనులు వేగవంతం చేయండి
అలాగే, నెయ్వేలి లిగ్నైట్ కార్పొరేషన్ (NLC)కి వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని పీఎంకే కూడా ముఖ్యమంత్రి విజయ్‌కు విజ్ఞప్తి చేసింది. మిత్రపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని న్యాయశాఖ మంత్రి నిర్మల్ కుమార్ తెలిపారు. విజయ్ నిర్ణయం పట్ల రైతులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
