- టీవీకేకు 120 మంది ఎమ్మెల్యేల సపోర్ట్
- వీసీకే, ఐయూఎంఎల్ పార్టీల బేషరతు మద్దతు
- సపోర్టర్ల లిస్ట్‌తో గవర్నర్‌ను కలిసిన విజయ్
- ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేను ఆహ్వానించిన గవర్నర్
- 13లోపు అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని సూచన
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో నాలుగు రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు బేషరతు మద్దతు తెలపడంతో తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ దక్కినట్లైంది. టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ శనివారం సాయంత్రం తన మద్దతుదారుల సంతకాలతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను కలుసుకున్నారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖలను పరిశీలించిన గవర్నర్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా విజయ్ ను ఆహ్వానించారు. ఈ నెల 13 వ తేదీలోగా అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలంటూ విజయ్ కి గడువు విధించారు. గవర్నర్ ఆమోదం తెలపడంతో ఆదివారం ఉదయం 10 గంటలకు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకలో విజయ్‌తో పాటు మరో తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకోసం చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. విజయ్ ప్రమాణ స్వీకారానికి జాతీయ స్థాయి నేతలు హాజరయ్యే అవకాశం ఉండటంతో చెన్నై పోలీసులు స్టేడియం పరిసరాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్లతో పహారా కాస్తున్నారు. గత 59 ఏళ్లుగా ద్రవిడ పార్టీల (డీఎంకే, అన్నాడీఎంకే) ఆధిపత్యంలో ఉన్న తమిళనాడు రాజకీయాల్లో, ఒక ‘ద్రవిడ యేతర’ నాయకుడు ముఖ్యమంత్రి కావడం ఇదే మొదటిసారి. అంతేకాదు తమిళనాడులో ఏర్పాటుకానున్న తొలి సంకీర్ణ ప్రభుత్వంగా టీవీకే సర్కారు రికార్డులకెక్కనుంది.
చివరి క్షణంలోనూ నాటకీయం
మే 4న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిలీజ్ కాగా.. 108 సీట్లతో టీవీకే లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయినప్పటికీ మెజార్టీ మార్క్‌కు పది అడుగుల దూరంలో నిలిచిపోయింది. అనంతరం కాంగ్రెస్ (5), వామపక్షాలు (4) మద్దతు ఇస్తామని ముందుకువచ్చాయి. వీసీకే కూడా మద్దతు ఇస్తుందని వార్తలు వచ్చినా.. అధికారికంగా లేఖ ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి లభించలేదు. ఎట్టకేలకు శనివారం వీసీకేతోపాటు ఐయూఎంఎల్ కూడా మద్దతు తెలుపుతూ లేఖలు ఇవ్వడంతో టీవీకే శ్రేణుల్లో సంబురాలు నెలకొన్నాయి. మెజారిటీ సాధించిన వెంటనే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని కోరుతూ విజయ్.. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అపాయింట్‌మెంట్ కోరారు. అయితే, కేరళ పర్యటన నేపథ్యంలో గవర్నర్ తొలుత అపాయింట్ మెంట్ తిరస్కరించారు. దీంతో లోక్ భవన్‌కు వెళ్లిన విజయ్ వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత కాసేపటికే గవర్నర్ అర్లేకర్ తన పర్యటన రద్దు చేసుకుని విజయ్ కు అపాయింట్ మెంట్ ఇచ్చారు. దీంతో సాయంత్రం ఆరున్నర గంటలకు విజయ్ తన మద్దతుదారులతో కలిసి వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు.
