- సీఎంగా ప్రమాణం చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు తీసుకురా..
- రెండోసారి కలిసిన టీవీకే చీఫ్‌కు స్పష్టం చేసిన గవర్నర్
- ఎన్డీఏలోని పార్టీలతో చర్చించే ఉద్దేశం లేదన్న టీవీకే
- లోక్‌భవన్ ఎదుట పార్టీ కార్యకర్తల నిరసన
- బీజేపీ చెప్పినట్టు నడుచుకుంటున్న గవర్నర్: కాంగ్రెస్
- రేపు లోక్‌భవన్ ముట్టడి, జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు పిలుపు
- ముందు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కి చాన్స్ ఇవ్వాలన్న స్టాలిన్
- టీవీకేకు మద్దతుపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని వీసీకే, ఐయూఎంఎల్,
- లెఫ్ట్ పార్టీలకు సూచన
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం తీవ్ర ఉత్కంఠగా మారింది. టీవీకే అధినేత విజయ్ గురువారం ఉదయం 11 గంటలకు మళ్లీ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిశారు. రెండు రోజుల్లో రెండోసారి లోక్ భవన్‌కు వెళ్లిన విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాలని.. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు, అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను రిక్వెస్ట్ చేశారు. అయితే, విజయ్ విజ్ఞప్తిని గవర్నర్ అర్లేకర్ మళ్లీ తిరస్కరించారు. 113 మంది ఎమ్మెల్యేల లేఖలు మాత్రమే సమర్పించారని, ప్రభుత్వ ఏర్పాటుకు ఈ సంఖ్య సరిపోదన్నారు.118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు సమర్పించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు మరే ఇతర పార్టీనీ ఆహ్వానించబోమని విజయ్‌కి గవర్నర్ హామీ ఇచ్చినట్టు లోక్‌భవన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని కోరుతూ టీవీకే కార్యకర్తలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖలు రాశారు.
ఎన్డీఏను సంప్రదించలేదు
234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో 118 మ్యాజిక్ ఫిగర్. ఎన్నికల్లో టీవీకే 108 సీట్లు గెలుచుకుంది. విజయ్ రెండు స్థానాల్లో గెలిచారు కనుక ఒక స్థానం వదులుకుంటే టీవీకే బలం 107 మాత్రమే అవుతుంది. కాంగ్రెస్ తన ఐదుగురు ఎమ్మెల్యేలతో టీవీకే కు మద్దతు ప్రకటించింది. ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం.
ఈ నేపథ్యంలో వీసీకే (2 సీట్లు), సీపీఐ, సీపీఎం (2 చొప్పున సీట్లు) పార్టీలతో టీవీకే చర్చలు కొనసాగిస్తున్నది. టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ ఎన్డీఏలో ఉన్న ఏ పార్టీని సంప్రదించలేదని, వారితో చర్చించే ఉద్దేశం కూడా తమకు లేదని స్పష్టం చేశారు. వీసీకే చీఫ్తిరుమావలన్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు విషయంలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటూ.. టీవీకే చీఫ్విజయ్పై ఒత్తిడి పెంచుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర కమిటీ సమావేశం తర్వాత మద్దతుపై స్పందిస్తామన్నారు. శుక్రవారం అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని సీపీఐ కూడా ప్రకటించింది.
విజయ్‌కు మద్దతుపై
మిత్రపక్షాలకు స్టాలిన్ స్వేచ్ఛ
ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కి మార్గం సుగమం చేస్తూ డీఎంకే అధినేత స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. తమ మిత్రపక్షాలైన వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఐతో భేటీ అయిన ఆయన విజయ్‌కి మద్దతిచ్చే అంశంపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. దీంతో శుక్రవారం ఉదయం ఈ పార్టీలు సమావేశమై టీవీకేకు మద్దతుపై తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నాయి. అంతకు ముందు ఇండియన్ యూనియన్ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) పార్టీ అధినేత ఖాదర్ మొహిద్దిన్ మీడియా మాట్లాడుతూ టీవీకే చీఫ్ విజయ్ తమను మద్దతు ఇవ్వాల్సిందిగా కోరినట్టు చెప్పారు. అయితే విజయ్ అభ్యర్థనపై తాము ఒంటరిగా నిర్ణయం తీసుకోబోమని తెలిపారు. ముందుగా తమ మిత్రపక్షమైన డీఎంకే అధినేత స్టాలిన్‌ను నిర్ణయం చెప్పాలని కోరుతున్నామని తెలిపారు. మరోవైపు టీవీకే కు ముందుగా అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాన్ని డీఎంకే కూడా వ్యక్తం చేసింది. డీఎంకే అధినేత స్టాలిన్ తమ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు.
గవర్నర్ రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నరు: బీజేపీ
రాజ్యాంగ విధివిధానాలకు అనుగుణంగానే గవర్నర్ వ్యవహరిస్తున్నారని, అన్ని వ్యవహారాలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి అన్నారు. అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి, విజయ్ ‘కేవలం నటుడు’ అని, టీవీకేకు మద్దతు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. మరోవైపు డీఎంకే, అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుంటాయని వెలువడుతున్న వార్తలను ఆ రెండు పార్టీలు కూడా ఖండించాయి. ప్రొటోకాల్ ప్రకారం తమిళనాడు సీఎంకు ఇచ్చే పోలీసు కాన్వాయ్‌ను విజయ్ వద్దన్నారు. ప్రమాణం చేయడానికి ముందే కాన్వాయ్ వద్దన్నట్టు టీవీకే పేర్కొంది. టీవీకే నుంచి వచ్చిన స్పందనను పోలీసులు గురువారం వెల్లడించారు. విజయ్‌కి ఏర్పాటు చేసిన కాన్వాయ్‌ను తాము తొలగించలేదని స్పష్టం చేశారు. ఫలితాల వెల్లడి తర్వాత పోలీసులు విజయ్‌కి కాన్వాయ్ ఏర్పాటు చేయండంతోపాటు, ఆయన నివాసం వద్ద సెక్యూరిటీని పెంచిన సంగతి తెలిసిందే. వాటిని తొలగించారనే వార్తల నేపథ్యంలో పోలీసులు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
లోక్‌భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు
గవర్నర్ తీరుకు నిరసనగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె.సెల్వపెరుంతగై ప్రకటించారు. చెన్నైలోని లోక్ భవన్ ముట్టడికి, అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నాలకు పిలుపు ఇచ్చారు. ప్రజలిచ్చిన తీర్పును గవర్నర్ కాలరాస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు. గవర్నర్ అర్లేకర్ రాజ్యాంగాన్ని గౌరవించకుండా.. బీజేపీ ముందు మోకరిల్లుతున్నారని తమిళనాడు కాంగ్రెస్ ఇన్చార్జ్ చోడంకర్ విమర్శించారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన గవర్నర్ తన బాధ్యతలు విస్మరించి ప్రధాని మోదీ, అమిత్‌షా చెప్పినట్టు నడుచుకుంటున్నారని ఆరోపించారు.
రాష్ట్రపతి పాలన విధించి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి: శ్రీధర్ వెంబు
తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించి మళ్లీ ఎన్నికలు నిర్వహించడం అత్యుత్తమ పరిష్కారమని జోహో సంస్థ సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అభిప్రాయపడ్డారు. సంఖ్యా బలం సరిపోలేదని, ప్రభుత్వం ఏర్పడినా అది అస్థిరంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్లకు నోట్లు అరికట్టేలా కఠిన చర్యలు తీసుకుని, మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే విజయ్ మరింత మెజారి టీతో అధికారంలోకి వస్తారని పేర్కొన్నారు. డీఎంకే, అన్నాడీఎంకేలు కలిసి ఒకే కూటమిగా కూడా పోటీ చేయవచ్చని, బీజేపీ ఒంటరిగా నిలబడాలని సూచించారు.
లోక్‌భవన్ వద్ద టీవీకే నిరసన.. నెహ్రూ స్టేడియం వద్ద నిరాశ
చెన్నైలోని గవర్నర్ నివాసం లోక్ భవన్ ఎదుట టీవీకే కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. విజయ్‌కి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాణ స్వీకారం జరుగుతుందని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంకు వచ్చిన వేలాది మంది అభిమానులు ఆ కార్యక్రమం రద్దైందని తెలుసుకొని నిరుత్సాహంతో వెనుదిరిగారు.
గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు అసహ్యకరం, రాజ్యాంగ విరుద్ధం. గవర్నర్ పదవిని రద్దు చేయాలి. అపాయింట్ అయిన ఒక వ్యక్తి ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలతో ఆటలు ఆడుతున్నారు. విజయ్‌కి ప్రజల మద్దతు లభించింది. ఆయనకు అసెంబ్లీ సభా వేదికపై తన హక్కును వినియోగించుకునే అవకాశం ఇవ్వాలి - ప్రకాశ్‌రాజ్
ఇది ప్రజల తీర్పును అవమానించడమే.ప్రజాస్వామ్యానికి నష్టం. మెజారిటీని నిరూపించాల్సింది రాజ్‌భవన్‌లో కాదు, శాసనసభలో. నేను మాట్లాడుతున్నది పార్టీ రాజకీయాల గురించి కాదు. ఇది ఒక భారతీయ పౌరుడిగా నా విధానపరమైన స్వరం- కమల్ హాసన్
