రైతు కేంద్రంగా విజయ డెయిరీ..సంస్థను లాభాల బాటలో నడిపించే బాధ్యత ఉద్యోగులదే: గుత్తా అమిత్‌‌‌‌రెడ్డి

రైతు కేంద్రంగా విజయ డెయిరీ..సంస్థను లాభాల బాటలో నడిపించే బాధ్యత ఉద్యోగులదే: గుత్తా అమిత్‌‌‌‌రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విజయ డెయిరీ సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు ప్రతి ఉద్యోగి అంకితభావంతో కృషి చేయాలని విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్‌‌‌‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇకపై డెయిరీ పూర్తిస్థాయిలో అభివృద్ధి పథంలో పయనించేలా పనిచేయాలని స్పష్టం చేశారు. డెయిరీ టెక్నాలజీ అసోసియేషన్ రూపొందించిన నూతన క్యాలెండర్, డైరీల ఆవిష్కరణ కార్యక్రమం శనివారం జరిగింది.

ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి అమిత్‌‌‌‌రెడ్డి మాట్లాడారు. రాబోయే రోజుల్లో విజయ డెయిరీని పూర్తిగా రైతు కేంద్రంగా నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. పాడి రైతులకు సకాలంలో పాల బిల్లులు చెల్లించడంతో పాటు వారికి అవసరమైన సాంకేతిక వనరులను అందించడంలో సంస్థ ఎప్పుడూ ముందంజలో ఉండాలని సూచించారు. 

పాల నాణ్యత, మార్కెటింగ్ విస్తరణ, ఖర్చుల నియంత్రణలో జాగ్రత్తలు పాటించాలని ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ సంస్థ పట్ల బాధ్యతగా వ్యవహరించినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని అభిప్రాయపడ్డారు. విజయ డెయిరీ తరఫున రైతులకు కావాల్సిన అన్ని వనరులు సకాలంలో అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.