- వాళ్లు సూసైడ్ చేసుకునేంత పిరికివాళ్లు కాదు
- అత్త, బామ్మర్దే కారణం
- తనకూ ప్రాణహాని ఉందంటూ వ్యాఖ్యలు
మేడిపల్లి, వెలుగు: మూడు నెలల కింద తన ఇద్దరు బిడ్డలతో కలిసి రైలు కిందపడి సూసైడ్ చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయారెడ్డి కేసు కీలక మలుపు తిరిగింది. ఇది కేవలం ఆత్మహత్య కాదని, ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులు చేసిన మానసిక వేధింపుల వల్లే ఈ ఘోరం జరిగిందని ఆమె భర్త సురేందర్ రెడ్డి మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. తన భార్య విజయారెడ్డి, బిడ్డలు చైతన్య రెడ్డి, విశాల్ రెడ్డిని మృత్యుఒడిలోకి నెట్టింది రక్త సంబంధీకులేనని మీడియాతో మాట్లాడారు.
అత్త పుష్పలత, బామ్మర్ది చిరంజీవి, ఆయన భార్య ఆస్తి కోసం నిరంతరం ఒత్తిడికి గురిచేయడం వల్లే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. తన భార్యాబిడ్డలు ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదని, ఆస్తి పిశాచాల వేధింపులే వారిని బలితీసుకున్నాయన్నారు. చనిపోవడానికి ముందు ఆ మూడు గంటల సమయంలో ఏం జరిగిందనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారిందని, బెడ్రూమ్లో కాలిన కాగితాలు లభించడం అనేక అనుమానాలకు తావిస్తోందని చెప్పారు.
దుర్ఘటన జరిగిన 25 రోజులకే..‘నీవు చనిపోతే ఆస్తి ఎవరి పేరిట రిజిస్ట్రేషన్ చేస్తారు?’ అంటూ తనను ప్రశ్నించడమే కాకుండా, బెదిరింపులకు దిగారన్నారు. తన ప్రాణాలకు సైతం హాని తలపెట్టే ప్రమాదం ఉందని, ఒకవేళ తనకు ఏమైనా జరిగితే, తన ఆస్తులన్నీ తల్లిదండ్రులకు లేదా సేవా సంస్థలకు (ట్రస్టులకు) చెందాలని ఆయన స్పష్టం చేశారు.
మా బావో అనుమాన పిశాచి..
మా బావ చేస్తున్న ఆరోపణలన్నీ అసత్యాలే. మా చెల్లెలి కంటే మూడేండ్లు మాత్రమే పెద్ద అని నమ్మించి పెండ్లి చేసుకున్నడు. కానీ, ఇద్దరి మధ్య 15 ఏండ్ల తేడా ఉన్నది. చాలా ఆస్తులున్నాయని, పెండ్లయ్యాక దుబాయ్ తీస్కపోతా అని అబద్దాలాడిండు. ఎప్పుడూ అనుమాన పడేవాడు..నైట్ డ్యూటీలు చేస్తే ఎవరితోనో సంబంధం పెట్టుకున్నవ్అని అని సతాయించేటోడు.
అసలు సురేందర్ రెడ్డి పేరెత్తితేనే ఆమె కోప్పడేది. ఇంటి కోసం చేసిన 30 లక్షల అగ్రిమెంట్ డబ్బులు నావే. ఆయనకు చెప్పే బిల్డర్ దగ్గరి నుంచి తీసుకున్నా. ఇప్పుడు మాట మారుస్తున్నడు. కేసును తప్పు తోవ పట్టించడానికే ప్రాణహాని అని కొత్త డ్రామా అడుతున్నడు. సురేందర్ రెడ్డి కాల్ డేటా బయటకు తీయాలి
– చిరంజీవి, విజయారెడ్డి అన్న

