బాల్య వివాహాలు చేస్తే కేసులు పెడతం : నారాయణ రెడ్ది

బాల్య వివాహాలు చేస్తే కేసులు పెడతం : నారాయణ రెడ్ది

వికారాబాద్, వెలుగు :  బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు.  ఆడపిల్లలకు18 ఏండ్లలోపు, మగపిల్లలకు 21 ఏండ్లలోపు పెండ్లి చేసేవారిపై, ప్రోత్సహించే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ లో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 

బాల్య వివాహాలపై పోలీస్, రెవెన్యూ, పంచాయతీ అధికారుల దృష్టికి వచ్చిన వెంటనే ఆపాల్సిన బాధ్యత ఉందని, పూజారులు, పాస్టర్లు, ఖాజీలు కూడా బర్త్ సర్టిఫికెట్ చూపించాకే పెండ్లి ముహూర్తం పెట్టాలని సూచించారు.  ఆడపిల్లలు ఎదుర్కొంటున్న తక్కువ విద్య, పౌష్టికాహారం లోపం, బాల్య వివాహాలు, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, గౌరవం వంటి వాటిపై అవగాహన కల్పించాలని వివరించారు. సోషల్ మీడియా కారణంగా విద్యార్థులు దారితప్పుతున్నారని, స్కూళ్లు, కాలేజీల్లో అవేర్ నెస్ కల్పించాలని సూచించారు. 

జిల్లాలో గతేడాది 138 బాల్య వివాహాలు జరిగాయని, అడ్వాన్స్ డ్  టెక్నాలజీ కాలంలోనూ జరుగుతుండగా.. మనం ఏ స్థాయిలో ఉన్నామో అర్థమవుతుందని పేర్కొన్నారు.  ఈ సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి జ్యోతి పద్మ,  ఐసీడీఎస్  సూపర్ వైజర్లు, పూజారులు, పాస్టర్లు, ఖాజీలు, సఖి, డీసీపీయూ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.