
- మూడు సెకండ్లపాటు కంపించిన భూమి
- నిద్రలో ఉలిక్కిపడ్డ స్థానికులు
పరిగి వెలుగు: వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున 3:47 గంటలకు మూడు సెకండ్లపాటు స్వల్పంగా భూ ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నిద్రలో ఉన్న చాలామంది ఉలిక్కిపడి ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇండ్లలోని వస్తువులు కదిలాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్సీ నారాయణరెడ్డి కలిసి తమ సిబ్బందితో మండలంలోని బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్నగర్ గ్రామాల్లో పర్యటించారు. భూ ప్రకంపనలు ఎప్పుడు వచ్చాయని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఇండ్లకు పగుళ్లు వచ్చి ఉంటే.. సదరు ఇండ్ల జాబితాను తనకు పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇండ్లతోపాటు మరేమైనా నష్టం వాటిల్లినా నివేదిక ఇవ్వాలని సూచించారు.