అభివృద్ధి చెందిన భారత్ కోసమే వికసిత్ యాత్ర: కిషన్ రెడ్డి

అభివృద్ధి చెందిన భారత్ కోసమే వికసిత్ యాత్ర: కిషన్ రెడ్డి
  • ప్రచార రథాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి  

హైదరాబాద్, వెలుగు :  దేశంలో పేదరిక నిర్మూలన, అన్ని రకాల మౌలిక వసతుల కల్పన కోసం గొప్ప సంకల్పం తీసుకోవడమే ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ ఉద్దేశమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. దేశం కోసం ప్రజలంతా ఐక్యం కావాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. శనివారం శంషాబాద్ మండలం చిన్న గోల్కొండలో ‘మా సంకల్పం అభివృద్ధి చెందిన భారతదేశం’ పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రచార రథాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. బ్రోచర్ లను కూడా విడుదల చేశారు. ‘మన సంకల్పం.. వికసిత్ భారత్’ అంటూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాబోయే 25 ఏండ్లలో భారత్ ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలపడమే లక్ష్యంగా మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో జనవరి 26 వరకు ఈ యాత్ర సాగుతుందన్నారు. కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంతోపాటు ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను స్వీకరిస్తామన్నారు. అన్ని గ్రామాల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, యువకులు.. అన్ని వర్గాలవారు ఈ యాత్రలో పాల్గొని మోదీ గ్యారంటీ వాహనానికి ఘన స్వాగతం పలకాలని కోరారు.   

శబరిలో సౌలతులపై కేరళ సీఎంకు లేఖ

శబరిమలలో తెలంగాణ అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని కేరళ సీఎం పినరయి విజయన్ కు కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఈ విషయంలో కేంద్రం తరఫున అవసరమైన సహాయ, సహకారాలను అందించేందుకు సిద్ధమని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా 15 లక్షలకుపైగా భక్తులు శబరిమలకు వస్తుంటారని, వారికి భోజనం, నీరు, వైద్యంతో సహా అవసరమైన సౌలతులు కల్పించి, ఇబ్బందులు పడకుండా చూడాలని కోరారు. ఇటీవల తొక్కిసలాటలో ఓ బాలిక చనిపోయిన విషయం తనను కలచివేసిందన్నారు.