కర్నాటక నుంచి పరిగికి గంజాయి .. కొన్ని గ్రామాల్లో గాంజా మొక్కల సాగు?

కర్నాటక నుంచి పరిగికి గంజాయి .. కొన్ని గ్రామాల్లో గాంజా మొక్కల సాగు?

పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పరిగి సెగ్మెంట్​లో గంజాయి దందా నడుస్తున్నా ఎక్సైజ్ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల జనం ఆరోపిస్తున్నారు. పూడూరు మండలంలోని నస్కల్, మాదారం గ్రామాల్లో గంజాయి సాగు జరుగుతున్నట్లు వారు చెబుతున్నారు. మరోవైపు పరిగి టౌన్​తో పాటు, గ్రామాల్లో బెల్ట్​ షాపుల దందాపై ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పరిగి మార్కెట్ యార్డ్, జింఖానా గ్రౌండ్, బీసీ కాలనీ, నస్కల్ గ్రామ శివారు, టీచర్స్ కాలనీ, తిరుమల వెంచర్ కాలనీల్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం.  పరిగిలో గంజాయి, బెల్ట్ షాపుల దందాపై   సీఐ చంద్రశేఖర్‌‌ను వివరణ కోరగా..  పూడూరు మండలంలోని కొన్ని గ్రామాల్లో గంజాయి సాగు జరుగుతున్నట్లు సమాచారం ఉందన్నారు.  

పరిగి టౌన్ శివార్లలోని గ్రామాలకు గంజాయిని కర్నాటక నుంచి ఇక్కడకి తీసుకొస్తున్నట్లు సమాచారం అందుతున్నప్పటికీ చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేసినా దొరకడం లేదన్నారు. అడ్డదారిలో గంజాయిని తరలిస్తున్నారని.. నిఘా పెంచుతామన్నారు. గంజాయి సప్లయర్లు, బెల్ట్ షాప్ నిర్వాహకులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆయా గ్రామాల జనం డిమాండ్ చేస్తున్నారు.