కోతులు, కుక్కల బెడద: ఊళ్లకు ఊళ్లే ఖాళీ అయ్యాయి

కోతులు, కుక్కల బెడద: ఊళ్లకు ఊళ్లే ఖాళీ అయ్యాయి

నోరులేని మూగ జీవాల పట్ల దయ చూపడం సంగతి ఎలా ఉన్నా.. సామాన్య జనాలకు మాత్రం కోతులు, ఊరకుక్కలు పెద్ద బెడదగా తయారయాయ్యి. వీటి దెబ్బకు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఊళ్లకు ఊళ్లే ఖాళీ అయిపోయాయి. హిమాచల్ ప్రదేశ్ రైతులు పొలాల్ని కార్ల పార్కింగ్ కోసం వదిలేసుకున్నారు.  కుక్కలు కరవడంతో రేబిస్ బారిన పడుతున్నారు. కోతులకు మనం పళ్లు, కొబ్బరి చిప్పలు పెట్టి ప్రేమగా చూసుకుంటాం. ఇప్పుడు అవే కోతులు మనకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎక్కడో అడవుల్లో  ఉండాల్సిన  కోతులు ఊళ్లల్లోకి, పట్టణాల్లోకి  బిలబిలా వచేచ్శాయి. ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

ఒకచోటు అని కాదు దేశంలోని అనేక ప్రాంతాల్లో కోతుల బెడద ఎక్కువైంది.  మహారాష్ట్రలో ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా కనిపిస్తుంది. రత్నగిరి జిల్లాలో కోతుల బెడదతో ప్రజలు గ్రామాలను  ఖాళీ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని ఊళ్లల్లో అయితే గుంపులు గుంపులుగా పొలాల్లో కి వెళ్తాయి. చేతికొచ్చిన పంటలను పాడు చేస్తున్నాయి. తిండి కోసం ఇళ్లల్లోకి జొరపడతాయి. నాలుగైదు కోతులు గుంపులుగా రావడం చూసి ఆడవాళ్లు భయంతో గెంతులేస్తారు.

హిమాచల్ ప్రదేశ్, సిమ్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కోతుల స్వైర విహారాన్ని తట్టుకోలేక ప్రజలు పొలాలను సాగు చేయడం మానేశారు. ఓ మోటార్ తయారీ కంపెనీ పార్కింగ్ కు పొలాన్ని అందెకిచ్చారు. వ్యవసాయాన్ని పక్కనపెట్టి, ఈ కంపెనీ ఇచ్చే పార్కింగ్ ఫీజుతో కాలం గడుపుతున్నారు.

కేరళలో కుక్కలను చూస్తే వణుకు..

కేరళ ప్రజలు ఊరకుక్కల్ని చూసి జడుసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఏడాది లక్ష మందికి పైగా కుక్క కాటుకు గురవుతున్నారు. ఇదీ ప్రజల భయానికి కారణం. ఈ వీధి కుక్కల పరిస్థితిని తెలుసుకోవడానికి నాలుగేళ్ల కిందట జస్టిస్ సిరి జగన్ నేతృత్వలో కమిటీని వేశారు. ఆ కమిటీ ఇచ్చిన ప్రాధమిక నివేదిక ప్రకారం పార్కులు, వీధుల్లో కుక్కలు ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నాయి. రేబిస్ నిరోధక టీకాల కోసం మెడికల్ సర్వీస్ కార్పొరేషన్ ఏటా దాదాపు రూ. 7కోట్లు ఖర్చు చేస్తుంది. 2016 మే వరకు కుక్క కాటుకు గురైనవారి సంఖ్య 31,334 కాగా 2015లో 1,22,286 మంది కుక్కల బారిన పడ్డారు. 2014లో 1,19,191 మంది కుక్కల దాడిలో గాయపడ్డారు. కోతులు ఇలా మూగ జీవాలకు సంబంధించిన చట్టాల్లో పెను మార్పులు చేయాల్సిన అవసరంలేదు కానీ..సామాన్య ప్రజలకు వాటివల్ల కలిగే సమస్యల నుంచి పరిష్కారం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.