వియత్నాంకు చెందిన ఈవీ దిగ్గజం విన్ ఫాస్ట్(VinFast) భారత మార్కెట్లో తన వ్యాపారాన్ని భారీగా విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. స్వదేశీ ఈవీ ప్లేయర్‌లకు గట్టి పోటీనిచ్చేందుకు భారీ వ్యూహరచన చేస్తోంది. 2026 ద్వితీయార్థం నాటికి రైడ్-హెయిలింగ్, టూ-వీలర్స్, బస్సులు, ఛార్జింగ్ ఇన్‌ఫ్రా రంగాల్లోకి ప్రవేశించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కేవలం కార్ల తయారీకే పరిమితం కాకుండా.. మొబిలిటీ ఎకో-సిస్టమ్ మొత్తాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకునేలా విన్ ఫాస్ట్ వేస్తున్న అడుగులు ఇప్పుడు భారత ఆటోమొబైల్ రంగంలో హాట్ టాపిక్‌గా మారాయి.
భారత మార్కెట్‌పై విన్ ఫాస్ట్ ఎంత సీరియస్‌గా ఉందో వారి పెట్టుబడులే చెబుతున్నాయి. కార్ల ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే 500 మిలియన్ డాలర్లు వెచ్చించిన కంపెనీ.. ఇప్పుడు టూ-వీలర్స్, బస్సుల విభాగం కోసం మరో 500 మిలియన్ డాలర్లను వెచ్చించడానికి సిద్ధమైంది. అంటే మెుత్తంగా భారతదేశంలో రూ.9వేల కోట్ల మెగా పెట్టుబడితో ముందుకెళుతోంది. తమిళనాడులోని అసెంబ్లింగ్ ప్లాంట్ ద్వారా ఏటా 1.50 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు, లోకలైజేషన్‌ను పెంచి రేట్లను తగ్గించే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది.
ఓలా, ఉబెర్‌లకు సవాల్..
విన్ ఫాస్ట్ గ్రూప్ కంపెనీ అయిన గ్రీన్ అండ్ స్మార్ట్ మొబిలిటీ ద్వారా రైడ్-హెయిలింగ్ అదేనండీ టాక్సీ సర్వీస్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓలా, ఉబెర్, ర్యాపిడోలకు నేరుగా సవాల్ విసిరినట్లే. విన్ ఫాస్ట్ కార్లు, స్కూటర్లను మాత్రమే ఉపయోగిస్తూ నడిచే ఈ ఫ్లీట్ సర్వీస్, భారత టాక్సీ మార్కెట్ సమీకరణాలను మార్చేసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. భవిష్యత్తు ప్రయాణం ఈవీ దిశగా జరుగుతున్న వేళ కంపెనీ ఎంట్రీ కీలకమని వారు చెబుతున్నారు.
టాటా నెక్షాన్‌కు పోటీగా..
ప్రస్తుతం రూ.17లక్షల 29వేలు ధర ఉన్న VF6 మోడల్ విన్ ఫాస్ట్‌కు ఎంట్రీ లెవల్ కారుగా ఉంది. అయితే సామాన్య ఈవీ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు టాటా నెక్షాన్ ఈవీ వంటి దిగ్గజాలకు పోటీగా ఒక కాంపాక్ట్ ఎస్‌యూవీని.. అలాగే టాక్సీ సెగ్మెంట్ లక్ష్యంగా ఒక సెవెన్ సీటర్ ఎంపీవీని లాంచ్ చేయనుంది కంపెనీ. మార్కెట్ లీడర్ అయిన టాటా మోటార్స్ తన మార్కెట్ వాటాను కాపాడుకోవడానికి విన్ ఫాస్ట్‌తో గట్టి పోరాటం చేయాల్సి ఉంటుందని ఆటో వర్గాలు చెబుతున్నాయి.
2025లో 35 డీలర్‌షిప్‌లతో ప్రారంభమైన విన్ ఫాస్ట్.. 2026 నాటికి వాటిని 70కి పెంచాలని టార్గెట్ పెట్టుకుంది. టూ-వీలర్స్, బస్సుల కోసం విడిగా డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తోంది. బ్యాటరీ సప్లై చైన్, విడిభాగాల విషయంలో దిగుమతులపై ఆధారపడకుండా స్థానికంగా పార్ట్స్ తయారు చేయడం ద్వారా ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తోంది. మొత్తానికి కార్లు, స్కూటర్లు, బస్సులు, రైడ్-హెయిలింగ్ సర్వీసులతో విన్ ఫాస్ట్ ఇండియాలో చేస్తున్న ఈ ఆల్ రౌండర్ అటాక్.. అటు టాటా, మహీంద్రా వంటి కార్ల తయారీదారులకు, ఇటు ఓలా వంటి రైడ్-హెయిలింగ్ కంపెనీలకు సవాలనే చెప్పుకోవాలి.
