రెండు రూపాయలకి గ్లాసుడు మంచినీళ్లు కూడా రావట్లేదు. అలాంటిది అదే రెండు రూపాయలకి కోన్ ఐస్‌క్రీమ్‌లు అమ్ముతున్నాడు చెన్నైకి చెందిన వినోద్. అది కూడా మ్యాంగో, పిస్తా, చాక్లెట్, వెనీలా, స్ట్రాబెర్రీ..ఇలా బోలెడు ఫ్లేవర్స్‌లో. ఇతను అమ్మే రసగుల్లా, పాలకోవా ఐస్‌క్రీమ్‌లు అయితే ఎవర్గ్రీన్. రెండు రూపాయలకే కప్పు టీ కూడా ఇస్తున్నాడు. ఇంత తక్కువ ధరలతో వ్యాపారం ఎలా చేస్తున్నాడు? అనిపిస్తుంది కదా! అదే ప్రశ్న అడిగితే.. ‘మూడు పువ్వులు.. ఆరు కాయలు’గా అని నవ్వుతూ చెప్తాడు వినోద్.
చెన్నై, వెస్ట్ మాంబళంలోని ఫైవ్ లైట్స్ స్ట్రీట్‌లో ఉంది ఈ ఐస్‌క్రీం షాపు. పేరు వినూస్ ఇగ్లూ. 1995 లో వినోద్ తండ్రి విజయన్ దీన్ని మొదలుపెట్టాడు. సినిమా థియేటర్స్ బయట అమ్మే కోన్ ఐస్‌క్రీమ్స్‌ని చూసి.. ఐస్‌క్రీం షాపు పెట్టాలనుకున్నాడట విజయన్. అప్పట్లో చెన్నైలో మిల్కీవే ఐస్‌క్రీమ్‌లు పాపులర్. వాటి కంటే డిఫరెంట్‌గా ఉండాలని ఇటాలియన్ ఐస్‌క్రీమ్ తయారీ మెషిన్ని కొన్నాడు. పేదవాళ్లకి కూడా తన ఐస్‌క్రీమ్స్ అందుబాటు ధరలో ఉండాలని.. ఒక్క రూపాయికే ఐస్‌క్రీం అమ్మడం మొదలుపెట్టాడు. కొన్నేండ్లకి అది రెండు రూపాయలు అయింది. ఆ తర్వాత షాపు బాధ్యత తండ్రి నుంచి వినోద్ తీసుకున్నాడు. అయినా కూడా ఐస్‌క్రీమ్ రేటు పెంచలేదు. అలా దాదాపు పదమూడేండ్లు తక్కువ ధరకే ఐస్‌క్రీమ్ అమ్మాడు. కానీ, 2008లో కొన్ని కారణాల వల్ల ఈ షాపు మూతపడింది.
అలా లాభాలొస్తున్నాయి
ఐస్‌క్రీమ్ షాపు మూతపడ్డాక..మళ్లీ తెరవాలని అనుకోలేదు వినోద్. కానీ, ఈ మధ్య తన పదిహేడేండ్ల కొడుకు ‘తాతయ్య గుర్తుగా నువ్వెందుకు రెండు రూపాయలకే ఐస్‌క్రీం ఎందుకు అమ్మకూడదు’ అని అడిగాడట వినోద్‌ని. దాంతో ఈ ఏడాది మొదట్లో మళ్లీ ఐస్‌క్రీమ్ షాపు తెరిచాడు. వెనీలా, స్టాబ్రెరీ, మ్యాంగో..ఇలా మొత్తం పదిహేను వెరైటీల్లో కోన్ ఐస్‌క్రీమ్‌లు అమ్ముతున్నాడు వినోద్. కోవా, గులాబ్జామున్, జెల్లీ , కేక్‌లు, బిస్కెట్లు, రకరకాల ఫ్రూట్స్.. కాంబినేషన్స్‌తో కూడా కోన్ ఐస్‌క్రీమ్‌లు ఇస్తున్నాడు. రెండు రూపాయల ఐస్‌క్రీమ్‌కి బిల్ కూడా ఇస్తాడు.. అలాగని క్వాలిటీలో కాంప్రమైజ్ కాడు. ఈ రేట్లతో బిజినెస్‌లో ఎలా నెగ్గుకొస్తున్నారని అడిగితే.. ‘‘కోన్ ఐస్‌క్రీమ్స్ వల్ల నాకు ఒక్క రూపాయి కూడా మిగలదు. కానీ, షాపుకొచ్చిన కస్టమర్స్ నా షాపులో అమ్మే మిగతా ఐస్‌క్రీమ్స్, జ్యూస్‌లు కూడా కొంటుంటారు. వాటి రేటు ఎనిమిది రూపాయల నుంచి ఉంటుంది. వాటివల్ల లాభాలొస్తున్నాయి. అలాగే క్వాంటిటీ ఎక్కువ కావాలంటే కోన్ ఐస్‌క్రీమ్‌కి ఇంకో ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తాం అన్నాడు’’ రెండు రూపాయలకే ఛాయ్ కూడా ఇస్తారు ఇక్కడ.
‘‘ఐస్‌క్రీమ్‌ని పాలు లేదా నీళ్లతో తయారుచేయొచ్చు. క్వాలిటీ, టేస్ట్ బాగుండాలని నేను ఖర్చు ఎక్కువైనా పాలతోనే తయారుచేస్తున్నా. నా షాపులో ఇరవై రూపాయల కోన్ ఐస్ క్రీం ఏ కంటైనర్ నుంచి వస్తుందో రెండు రూపాయల కోన్ ఐస్‌క్రీమ్ కూడా అందులో నుంచే వస్తుంది. చాలామంది చిన్నపిల్లలు, కాలేజీ స్టూడెంట్స్ ఐస్‌క్రీమ్‌ని ఇష్టంగా తినడం చూస్తే.. మనసుకు చాలా తృప్తిగా ఉంటుంది” అంటున్నాడు వినోద్.
