భార‌త్ – చైనా స‌రిహ‌ద్దు ఘ‌ర్ష‌ణ‌: ఆ న‌లుగురు జ‌వాన్లు కోలుకుంటున్నారు

భార‌త్ – చైనా స‌రిహ‌ద్దు ఘ‌ర్ష‌ణ‌: ఆ న‌లుగురు జ‌వాన్లు కోలుకుంటున్నారు

భార‌త్ – చైనా స‌రిహ‌ద్దుల్లో జ‌రిగిన హింసాత్మ‌క ఘ‌ర్ష‌ణ‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన న‌లుగురు జ‌వాన్లు కోలుకుంటున్నార‌ని ఆర్మీ వ‌ర్గాలు తెలిపాయి. నిన్న క్రిటిక‌ల్ కండిష‌న్‌లో ఉన్న ఆ వీర సైనికుల ఆరోగ్య ప‌రిస్థితి ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గా ఉంద‌ని, వారికి మెరుగైన వైద్య సాయం అందుతోంద‌ని పేర్కొన్నాయి. ల‌ఢ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ ప్రాంతంలో సోమ‌వారం రాత్రి చైనా సైనికులు భార‌త భూభాగంలోకి చొచ్చుకుని రావ‌డంతో భార‌త బ‌ల‌గాలు అడ్డుకున్నాయి. ఈ స‌మ‌యంలో రెండు దేశాల జ‌వాన్ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. చైనా సైనికులు రాళ్లు, ఇనుప‌రాడ్ల‌తో దాడికి దిగడంతో ప‌లువురు భార‌త జ‌వాన్లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో క‌ల్న‌ల్ సంతోష్ బాబు స‌హా 20 మంది భార‌త జ‌వాన్లు అమ‌రులయ్యారు. ఈ స‌మ‌యంలో మ‌రి కొంద‌రు సైనికులు గాయ‌ప‌డ్డార‌ని, అయితే వారిలో న‌లుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని నిన్న ఆర్మీ తెలిపింది. అయితే ఆస్ప‌త్రిలో చికిత్స‌తో ప్ర‌స్తుతం కోలుకుంటున్నార‌ని ఆర్మీ అధికారి ఒక‌రు చెప్పారు.

కాగా, గాల్వన్ లోయ వ‌ద్ద భార‌త భూభాగంలోకి చొచ్చుకుని వ‌చ్చి దాడికి పాల్ప‌డిన స‌మ‌యంలో మ‌న జ‌వాన్లు గ‌ట్టిగా ప్ర‌తిఘ‌టించారు. ప్ర‌తి దాడిలో చైనా ఆర్మీ క‌మాండింగ్ ఆఫీస‌ర్ స‌హా 40 మంది వ‌ర‌కు సైనికులు మ‌ర‌ణించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే దీనిపై చైనా ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.