మూడో దశలో 63 శాతం

మూడో దశలో 63 శాతం

11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 నియోజకవర్గాల్లో ఎన్నికలు
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్​
అత్యధికంగా అస్సాంలో 77.06 % , అత్యల్పంగా యూపీలో 57%
గాంధీనగర్​లో ఓటేసిన ప్రధాని మోదీ, అహ్మదాబాద్​లో అమిత్​ షా,
కర్నాటకలో ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్​ చీఫ్​ ఖర్గే

న్యూఢిల్లీ:  సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడో దశ పోలింగ్​ ముగిసింది. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 నియోజకవర్గాల్లో మంగళవాడరం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్​ రాత్రి 6 గంటల వరకూ కొనసాగింది. అన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 63 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎలక్షన్​ కమిషన్​ తెలిపింది. అస్సాంలో 77.06 శాతం ఓటింగ్​ జరిగింది. ఉత్తరప్రదేశ్​లో అత్యల్పంగా 57.34 శాతం పోలింగ్​ నమోదైంది. వాస్తవానికి ఈసీ ఈ మూడోదశ ఎన్నికల్లో మొత్తం 94 నియోజకవర్గాలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. గుజరాత్​లోని సూరత్ నియోజకవర్గంలో ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్​ను ఉపసంహరించుకోవడంతో  బీజేపీ అభ్యర్థి ముఖేష్  దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆ లోక్ సభ స్థానానికి ఎన్నిక జరగడం లేదు. ఈ దశలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​షా సహా కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా(గుణ), మన్‌‌‌‌సుఖ్ మాండవియా (పోర్‌‌‌‌బందర్), పురుషోత్తమ్​ రూపాలా (రాజ్‌‌‌‌కోట్), ప్రహ్లాద్ జోషి (ధార్వాడ్),  ఎస్‌‌‌‌పీ సింగ్ బఘేల్ (ఆగ్రా) తదితర ప్రముఖులు బరిలో ఉన్నారు.

అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు

ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్​ బూత్​లలో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. బెంగాల్​లోని జాంగిపూర్​లో స్వల్ప ఘర్షణలు జరిగాయి. బీజేపీ క్యాండిడేట్​ ధనుంజయ్ ఘోష్ కు స్థానిక తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కార్యకర్తకు మధ్య  గొడవ జరిగింది. పోలింగ్​ బూత్​ల వద్ద ధనుంజయ్​ ఘోష్​ ఓటర్లను ప్రభావితం చేస్తున్నాడని టీఎంసీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ముర్షీదాబాద్​లోనూ టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్​, సీపీఎం కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. కరీంపూర్ సీటు పరిధిలోని కొన్ని బూత్‌‌‌‌ల వెలుపల టీఎంసీ, సీపీఎం, డోమ్‌‌‌‌కోల్ ప్రాంతంలో టీఎంసీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కాగా, యూపీలోని మెయిన్​పురిలో బూత్​లను దోచుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారని అఖిలేశ్​ యాదవ్​ ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను పోలీస్​స్టేషన్లలో బంధిస్తున్నారని మండిపడ్డారు. రోడ్డు వేయనందుకు బుదౌన్​ పరిధిలోని ధోరన్​పూర్​ గ్రామస్తులు ఎన్నికలను బాయ్​కాట్​చేశారు. తమ సమస్యలను పరిష్కరించడం లేదంటూ ఫిరోజాబాద్ పరిధిలోని నాగ్లా జవహర్​, నీమ్​ ఖేరియా, నాగ్లా ఉమర్​ గ్రామాల్లో ఒక్క ఓటుకూడా వేయలేదు. కర్నాటకలో ఎలక్షన్​ డ్యూటీలో ఉన్న ఇద్దరు అధికారులు గుండెపోటుతో మృతిచెందినట్టు ఈసీ వెల్లడించింది.

ఓటేసిన ప్రముఖులు

పలుచోట్ల ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. గుజరాత్​లోని గాంధీనగర్​ పోలింగ్​బూత్​లో ప్రధాని మోదీ ఓటు వేయగా.. అహ్మదాబాద్​లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా కుటుంబంతో కలిసి  ఓటేశారు. కర్నాటకలో కాంగ్రెస్​ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓటు వేశారు. యూపీలోని సైఫాయిలో సమాజ్​వాదీ(ఎస్పీ) పార్టీ చీఫ్​ అఖిలేశ్​ యాదవ్​, ఆయన సతీమణి డింపుల్ యాదవ్​ ఓటుహక్కును వినియోగించుకున్నారు.