- రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో313 గ్రామాల్లో పోలింగ్
- ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఆఫీసర్లు బిజీ బిజీ
- ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాలపై దృష్టి పెట్టిన అభ్యర్థులు
ఖమ్మం/భద్రాద్రికొత్తూడెం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడో విడత ఎన్నికలు జరిగే మండలాల్లో ప్రచార గడువు ముగిసింది. రేపు ఎన్నికలు జరిగే 313 గ్రామాల్లో పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
జిల్లావారీగా పరిస్థితి..
ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, కారేపల్లి, తల్లాడ, వేంసూరు మండలాల్లో మూడో విడత పోలింగ్ రేపు జరగనుంది. సోమవారం సాయంత్రం 5 గంటలతో ఈ మండలాల్లో ప్రచారం క్లోజ్ అయింది. ఏడు మండలాల్లో మొత్తం 191 గ్రామాలకు గాను, ఎస్టీ అభ్యర్థి లేకపోవడంతో ఒక గ్రామంలో సర్పంచ్ కు నామినేషన్ దాఖలు కాలేదు.
22 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవం కాగా, 168 గ్రామాల్లో 485 మంది పోటీలో ఉన్నారు. 1,742 వార్డులకు గాను 9 చోట్ల నామినేషన్లు రాలేదు. 361 వార్డులు ఏకగ్రీవం కాగా, 1,372 వార్డుల్లో 3,369 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రచారం క్లోజ్ అవుతుండడంతో, చివరి రోజు అభ్యర్థులు జోరు పెంచారు. సర్పంచ్ క్యాండిడేట్లు, వార్డు మెంబర్లను వెంటబెట్టుకొని ఇంటింటి ప్రచారం చేశారు.
చివరి రోజు ప్రచారంలో ఓటర్లను కలిసి తమ గుర్తుతో ముద్రించిన పాంప్లేట్స్, డమ్మీ బ్యాలెట్ పేపర్లను పంచుతూ ప్రచారం చేశారు. సాయంత్రానికి ప్రచారం ముగియడంతో డబ్బు, మద్యంతో పాటు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాలపై దృష్టిపెట్టారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ఆళ్లపల్లి, గుండాల, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లో మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. ఏడు మండలాల్లో 155 గ్రామపంచాయతీలు, 1,330 వార్డులున్నాయి. 155 పంచాయతీలకు గానూ రెండింటిలో నామినేషన్లు దాఖలు కాలేదు. 8 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 145 పంచాయతీల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
1,330 వార్డులకు గానూ మూడు వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 256 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 1,071 వార్డులలో ఎన్నికలు జరుగనున్నాయి. బుధవారం జరుగనున్న పోలింగ్‌లో భాగంగా మంగళవారం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ సిబ్బంది, బ్యాలెట్ బాక్స్‌లను తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లలో ఆఫీసర్లు నిమగ్నమయ్యారు. కాగా, చివరి రోజు అభ్యర్థులతోపాటు వారికి మద్దతు ఇస్తున్న పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.
ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక నియోజకవర్గంలోని గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ మద్ధతు దారులను గెలిపించాలని ఓటర్లను కోరారు. లక్ష్మీదేవిపల్లి మండలంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీపీఐ మద్ధతు దారులను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. లక్ష్మీదేవిపల్లి మండలంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వనమా వెంకటేశ్వర రావు ప్రచారం నిర్వహించారు.
