నల్గొండ జిల్లాలో ముగిసిన మూడవ విడత ప్రచారం..గెలుపు పై దృష్టి పెట్టిన ప్రధాన పార్టీలు

నల్గొండ జిల్లాలో ముగిసిన మూడవ విడత ప్రచారం..గెలుపు పై దృష్టి పెట్టిన ప్రధాన పార్టీలు
  •  ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు 
  • నేడు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది 

నల్గొండ, వెలుగు:  మూడవ దశ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. సోమవారం సాయంత్రం ప్రచార గడువు ముగియడంతో అభ్యర్థులు ప్రలోభాలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రధాన పార్టీలు తమ మద్దతుదారులను పెద్దసంఖ్యలో గెలిపించుకోవడం మీద దృష్టి పెట్టాయి. మూడవ విడత పోలింగ్ కోసం అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మండల కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసి.. పోలింగ్ సామగ్రిని పంపించారు. పోలింగ్​ స్వేచ్చగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు బలగాలు మొహరించాయి. 

మూడవ విడతలో నల్గొండ జిల్లా దేవరకొండ డివిజన్ పరిధిలోని చందంపేట, చింతపల్లి, దేవరకొండ, గుడిపల్లి, గుండ్లపల్లి, గుర్రంపోడు, కొండమల్లేపల్లి, నేరేడుగొమ్ము, పీఏపల్లి మండలాలలోని 269 పంచాయితీలకు ఎన్నికలు జరగనున్నాయి. సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్ డివిజన్ పరిధిలోని హుజూర్ నగర్, నేరేడు చర్ల, గరిడేపల్లి, మేళ్లచెర్వు, చింతలపాలెం, పాలకీడు, మట్టంపల్లి మండలాల్లోని 124 గ్రామ పంచాయతీలు, 1,176 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. మంగళవారం ఉదయం మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సిబ్బంది ఎన్నికల సామగ్రిని తీసుకుని పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 

గెలుపు పై దృష్టి పెట్టిన ప్రధాన పార్టీలు 

 ప్రధాన పార్టీలు గెలుపు మీద దృష్టి పెట్టాయి. రెండు విడతల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్ ఈసారి కూడా ఆధిక్యాన్ని కొనసాగించేందుకు వ్యూహాలు రచిస్తోంది. హుజూర్ నగర్ డివిజన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోకస్ పెట్టి అభ్యర్డులకు దిశానిర్దేశం చేశారు. దేవరకొండ డివిజన్ లో ఎమ్మెల్యేలు బాలు నాయక్, జైవీర్ రెడ్డి ప్రచారం చేశారు.

 మొదటి, రెండవ విడతలో ఆశించిన ఫలితాలు దక్కని బీఆర్ఎస్ మూడవ విడతలోనైనా ఎక్కువ చోట్ల గెలవాలని కృషి చేస్తోంది. కొన్ని చోట్ల అభ్యర్థులు ప్రలోభాలు తెర లేపారు. మద్యం, డబ్బులు పంపిణీ చేసేందుకు రెడీఅవుతున్నారు. వలస ఓటర్లను రప్పించేందుకు ఓటుకు రూ. 2 వేలు, రవాణా ఖర్చులు ఇస్తున్నారు.

ఓటుకు రూ.10 వేలు చెల్లించేందుకు రెడీ! 

 చౌటుప్పల్​ మండలంలో పలువురు అభ్యర్థులు భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు. కొన్ని పంచాయతీల్లో ఓటుకు రూ.10 వేలు చెల్లించేందుకు కూడా రెడీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. రెండు దశల్లో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ మధ్యపోటీ కొనసాగినా కాంగ్రెస్​ మద్దతిచ్చిన సర్పంచ్​లే ఎక్కువ మంది గెలిచారు. ఇండిపెండెంట్లుగా గెలిచిన సర్పంచ్​లు కాంగ్రెస్​లో చేరిపోతున్నారు. 

ఈసారి ఆధిక్యాన్ని సాధించాలని కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ ప్రయత్నాలు చేస్తున్నాయి. రెండు దశల్లోనూ పదిలోపే సర్పంచ్​లను గెలుచుకున్న బీజేపీ కూడా మెరుగైన ఫలితాలు దక్కించుకోవాలని ఆశిస్తోంది. 

ష్​.. గప్​చుప్​.. యాదాద్రిలో ప్రలోభాలు షురూ

యాదాద్రి, వెలుగు: మూడోదశ ఎన్నికలకు యాదాద్రి జిల్లా రెడీ అయింది. సోమవారం సాయంత్రం ప్రచారం బంద్​కాగా గ్రామాలు సైలెన్స్​గా మారిపోయాయి. ఎన్నికలు జరిగే మండలాల్లో వైన్స్​లను మూసి వేశారు. డిస్ట్రిబ్యూషన్​ సెంటర్లలో బ్యాలెట్​ పేపర్లు, బాక్సులు రెడీగా ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియ కోసం ఆర్​వో, పీవో, ఓపీవో ఎంపిక పూర్తయింది. పోలింగ్​ సెంటర్లలో వెబ్​ కాస్టింగ్​ కూడా చేయనున్నారు. 

ప్రచారం ముగియడంతో.. సోమవారం రాత్రి నుంచి పంపకాలకు సిద్ధమవుతున్నారు. యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్, సంస్థాన్​ నారాయణపురం, అడ్డగూడూరు, గుండాల, మోత్కూరు మండలాల్లో ఏకగ్రీవ స్థానాలు పోనూ బుధవారం 114 సర్పంచ్​, 993 వార్డుమెంబర్​ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 

సర్పంచ్​, వార్డ్ మెంబర్​ లకు సంబంధించి బాలెట్​ పేపర్లను, బ్యాలెట్​ బాక్సులు, ఇతర సామగ్రిని మంగళవారం గ్రామాలకు తరలిస్తారు. జిల్లాలో 2457 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. జిల్లాలో 9 క్రిటికల్​ పోలింగ్​ సెంటర్లు, 45 సెన్సిటివ్​ సెంటర్లు ఉన్నాయి. 12 పోలింగ్​ సెంటర్లలో వెబ్​ కాస్టింగ్​ చేయనున్నారు. ​