ఎలాన్ మస్క్ పేరు వింటేనే సంచలనం. రాకెట్ల తయారీ నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకు, ఏఐ నుంచి సోషల్ మీడియా వరకు.. ఆయన వేసే అడుగులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే శాసిస్తున్నాయి. తాజాగా ఫోర్బ్స్ డేటా ప్రకారం మస్క్ సంపద విలువ 600 బిలియన్ డాలర్ల మార్కును దాటడం ఆర్థిక ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారత కరెన్సీ లెక్కల ప్రకారం దీని విలువ రూ.54 లక్షల కోట్లుగా ఉంది. వాస్తవానికి ఇది మానవ చరిత్రలో రికార్డ్ అయిన అతిపెద్ద మెుత్తం.
1. ముందుగా ఎలాన్ మస్క్ సంపద ఇంత వేగంగా పెరగడానికి ప్రధాన కారణం స్పేస్‌ఎక్స్. ఈ సంస్థ త్వరలో ఐపీవోకి వెళ్లే ఆలోచనలో ఉందని, దాని వాల్యుయేషన్ 800 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని వార్తలు వచ్చాయి. దీనిలో మస్క్‌కు సుమారు 42% వాటా ఉంది. ఈ కొత్త లెక్కల ప్రకారం మస్క్ వ్యక్తిగత ఆస్తి విలువ సోమవారం ఒక్కరోజే ఊహించని రీతిలో పెరిగింది. ఐపీవో వచ్చే ఏడాది ఖరారైతే మస్క్ ఆస్తి ఏకంగా 677 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.
2. ఇక ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాలో మస్క్‌కు 12% వాటా ఉంది. ఈ ఏడాది టెస్లా అమ్మకాలు కొంత నెమ్మదించినప్పటికీ.. స్టాక్ మార్కెట్‌లో షేర్లు మాత్రం 13% లాభపడ్డాయి. ముఖ్యంగా 'రోబోట్యాక్సీ' పరీక్షల గురించి మస్క్ చేసిన ప్రకటన ఇన్వెస్టర్లలో జోష్ నింపింది. ముందు సీటులో సేఫ్టీ మానిటర్లు లేకుండానే టెస్లా కార్లను పరీక్షిస్తున్నట్లు తెలపడంతో సోమవారం టెస్లా షేర్లు 4% పెరిగాయి.
3. నవంబర్ నెలలో టెస్లా షేర్ హోల్డర్లు మస్క్ కోసం 1 ట్రిలియన్ డాలర్ల భారీ పే ప్యాకేజీని ఆమోదించారు. కార్పొరేట్ చరిత్రలోనే ఇదే అతిపెద్ద వేతన ప్యాకేజీ. టెస్లాను కేవలం కార్ల కంపెనీగానే కాకుండా.. ప్రపంచంలోనే అతిపెద్ద AI , రోబోటిక్స్ సంస్థగా మార్చాలన్న మస్క్ విజన్‌ను ఇన్వెస్టర్లు బలంగా నమ్ముతున్నారు.
4. ఇక చివరిగా మస్క్ స్థాపించిన ఏఐ స్టార్టప్ xAI కూడా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. దాదాపు 230 బిలియన్ డాలర్ల విలువతో.. కొత్తగా 15 బిలియన్ డాలర్ల నిధులను సేకరించేందుకు ఈ సంస్థ చర్చలు జరుపుతోంది. దీనివల్ల భవిష్యత్తులో మస్క్ సంపద మరింత పెరిగి, ఆయన ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ (లక్ష కోట్ల డాలర్ల యజమాని) అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
