అంతా సైలెన్స్.. గ్రామాల్లో ముగిసిన మూడో దశ ఎన్నికల ప్రచారం

అంతా సైలెన్స్.. గ్రామాల్లో ముగిసిన మూడో దశ ఎన్నికల ప్రచారం
  •  పైసలు, లిక్కర్, చికెన్, మటన్ పంపిణీ స్టార్ట్ చేసిన అభ్యర్థులు
  •  చివరి రోజు హోరెత్తిన క్యాంపెయిన్ 
  •  ఉమ్మడి జిల్లాలోని 386 సర్పంచ్ స్థానాలకు 1,580 మంది పోటీ  

కరీంనగర్, వెలుగు:  గ్రామపంచాయతీ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మూడో దశలో  ఎన్నికలు జరిగే పంచాయతీల్లో సోమవారం సాయంత్రం ప్రచారానికి తెరపడింది. రోజూ డీజే పాటలు, మైక్ లు, డప్పు చప్పుళ్లతో హోరెత్తిన గ్రామాల్లో నిశబ్ద వాతావరణం నెలకొంది. 

ప్రచారం ముగించిన సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రలోభాలకు తెరలేపారు. సోమవారం రాత్రి నుంచే ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.2 వేల వరకు పంచేపనిలో పడ్డారు. కొందరు డబ్బులతోపాటు మందు బాటిళ్లు, చికెన్, మటన్ కూడా పంపిణీ చేస్తున్నారు. మంగళవారం రోజంతా ప్రలోభాలపర్వమే కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. 

కరీంనగర్ జిల్లాలో మూడో విడతలో హుజూరాబాద్(20 జీపీలు), జమ్మికుంట(20), ఇల్లందకుంట(18), వీణవంక(26), వి.సైదాపూర్(27) మండలాల్లోని 111 పంచాయతీల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వగా.. ఇల్లందకుంట, వీణవంక, సైదాపూర్ మండలాల్లో ఒక్కో సర్పంచ్ చొప్పున ముగ్గురు సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 108 సర్పంచ్ స్థానాల్లో 451 మంది పోటీపడుతున్నారు. అలాగే 111 గ్రామాల్లో 1,034 వార్డు మెంబర్లకుగానూ 184 మంది ఏకగ్రీవం కాగా, మరో 850 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటిలో 2,421 మంది పోటీపడుతున్నారు.  

పెద్దపల్లి జిల్లాలో.. 

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. జిల్లాలో మూడో విడతలో పెద్దపల్లి, సుల్తానాబాద్​, ఓదెల, ఎలిగేడు మండలాల్లో 91 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మండలాల్లో ఇప్పటికే ఆరుగురు సర్పంచులు ఏకగ్రీవం కాగా, మిగతా 85 గ్రామ పంచాయతీల్లో బుధవారం ఎన్నికలు జరుగనున్నాయి. 

నాలుగు మండలాల పరిధిలో 1,44,563 మంది ఓటర్లు ఉండగా, అందులో మహిళలు 73,669, పురుషులు 70,892 మంది ఓటర్లు ఉన్నారు. సుల్తానాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలంలోని పలు గ్రామాల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు చివరి రోజు ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయితీ ఎన్నికల ప్రచారం ముగిసింది. జిల్లాలో మొత్తం 119 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, అందులో 6 గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 113 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 456 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవుల కోసం పోటీ పడుతున్నారు.

 మండలాల వారీగా చూస్తే బుగ్గారం మండలంలో 10 జీపీలకు 49 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ధర్మపురి మండలంలో 25 గ్రామ పంచాయతీలకు గానూ 3 చోట్ల ఏకగ్రీవం కాగా.. 22 గ్రామాల్లో 91 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎండపల్లి మండలంలో 15 జీపీలకు గానూ ఒక గ్రామంలో ఏకగ్రీవం జరగగా, 14 గ్రామాల్లో పోలింగ్ ఉండనుంది.

 గొల్లపల్లి మండలంలో అన్ని 27 పంచాయతీల్లో 99 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పెగడపల్లి మండలంలో 23 జీపీలకు రెండు గ్రామాల్లో ఏకగ్రీవం జరిగి, 21 గ్రామాల్లో పోలింగ్ జరగనుంది. వెల్గటూరు మండలంలో 19 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా 74 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 

రాజన్నసిరిసిల్ల/వేములవాడ,వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. జిల్లాలో  మొత్తం 87 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా 7 సర్పంచ్ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 80 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ స్థానాలకు 379 మంది పోటీ పడుతున్నారు. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.