టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ పీర్జాదా. తొలి సినిమాతోనే 'మహాలక్ష్మి'గా తన నటనతో, క్యూట్ లుక్స్‌తో మెప్పించిన ఈ భామ.. ఆ తర్వాత ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘F2’, ‘F3’ వంటి వరుస విజయాలతో టాలీవుడ్‌లో గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకుంది. అయితే, గత కొంతకాలంగా వెండితెరపై పెద్దగా కనిపించని మెహ్రీన్.. ఇప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
ఏమిటా వివాదం?
గత కొద్దిరోజులుగా మెహ్రీన్ చిరంజీవి మక్యానా అనే వ్యక్తిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందంటూ నెట్టింట కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. గతంలో కూడా ఇతర వ్యక్తులతో ఈమె బంధంలో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. లేటెస్ట్ గా ఒక ప్రముఖ మీడియా సంస్థ మెహ్రీన్ పెళ్లి గురించి కథనం ప్రచురించడంతో ఈ వ్యవహారం ముదిరింది. చివరకు ఈ వార్తలపై మెహ్రీన్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ తన మౌనాన్ని వీడింది.
గత రెండేళ్లుగా ఇలాంటి తప్పుడు వార్తలపై మౌనంగా ఉన్నా.. కానీ ఇప్పుడు మాట్లాడక తప్పడం లేదని సీరియస్ అయింది.. ఓ వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నట్లు రాస్తున్నారు. అసలు అతడెవరో కూడా నాకు తెలియదు, కనీసం పరిచయం కూడా లేదు. నేను ఎవరినీ వివాహం చేసుకోలేదు. నా పెళ్లి గురించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందరికీ చెబుతా. దయచేసి ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయకండి అని మెహ్రీన్ కోరింది..
వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు
మెహ్రీన్ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే 2021లో హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు, ఎమ్మెల్యే కుమారుడైన భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం జరిగింది. అయితే, పెళ్లి పీటల వరకు వెళ్లకముందే అనివార్య కారణాల వల్ల వీరిద్దరూ బంధాన్ని తెంచుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ఆమె తన కెరీర్‌పై దృష్టి పెట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు. మధ్యలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో కూడా ఈమె ప్రేమాయణం సాగిస్తోందంటూ పుకార్లు వచ్చినప్పటికీ, అవన్నీ కేవలం గాసిప్స్‌గానే మిగిలిపోయాయి. ఇటీవల ఒక పెయింటింగ్ ఫొటోను షేర్ చేస్తూ.. "ఇది కేవలం కళ కాదు.. ఇది మనమే" అంటూ ఎమోషనల్ క్యాప్షన్ పెట్టడం వల్ల కూడా నెటిజన్లు రకరకాల అర్థాలు తీశారు.
ప్రస్తుత ప్రాజెక్టులు
వరుస హిట్ల తర్వాత ‘స్పార్క్’ వంటి కొన్ని సినిమాలు నిరాశపరిచినప్పటికీ, మెహ్రీన్ తన ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. 'F3' సినిమా తర్వాత గ్యాప్ రావడంపై స్పందిస్తూ.. అది తాను కావాలని తీసుకున్నది కాదని, 'సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ' అనే వెబ్ సిరీస్ కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈమె కన్నడలో ఒక భారీ చిత్రంలో నటిస్తోంది. మొత్తానికి తన పెళ్లిపై వస్తున్న రూమర్లకు గట్టిగానే చెక్ పెట్టిన మెహ్రీన్.. ఇకముందైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఆగుతాయని ఆశిస్తోంది.
