ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ‘తుది’ ప్రచారానికి తెర.. చివరి రోజు జోరుగా ప్రచారం

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ‘తుది’ ప్రచారానికి తెర.. చివరి రోజు జోరుగా ప్రచారం
  •  రేపు మూడో విడత పంచాయతీ పోలింగ్​
  •  ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు 
  •  నిజామాబాద్​జిల్లాలో 12, కామారెడ్డి జిల్లాలో 8 మండలాల్లో పల్లె పోరు 
  •  ప్రలోభాల పర్వం షురూ

నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు :  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. వారం రోజులుగా హోరాహోరీగా ప్రచారం సాగింది. బలం, బలగంతో ర్యాలీలు తీస్తూ ఇంటింటికీ వెళ్లి అభ్యర్థుల గుర్తులు చూపుతూ ప్రచారం చేశారు. అభ్యర్థులు వంగివంగి దండాలు పెట్టడం, పొద్దున్నే లేవగానే వినిపించే మైక్ చప్పుళ్లు బంద్ కావడంతో పల్లెల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. 

ఉమ్మడి జిల్లాలో 288 పంచాయతీల్లో రేపు పోలింగ్..​

నిజామాబాద్​జిల్లా ఆర్మూర్​డివిజన్​లో 12, కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్​లోని 8 మండలాల్లో బుధవారం పల్లె పోరు జరగనుంది. నిజామాబాద్​ జిల్లాలోని ఆలూర్​, ఆర్మూర్​, బాల్కొండ, భీంగల్​, డొంకేశ్వర్​, కమ్మర్​పల్లి, మెండోరా, మోర్తాడ్​, ముప్కాల్​, నందిపేట, వేల్పూర్​, ఎర్గెట్ల మండలాల్లో 165 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో 19 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం కాగా, మిగతా 146 సర్పంచ్ పదవులకు  562 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 

1,620 వార్డులున్న డివిజన్​లో 490 వార్డులు యునానిమస్ అయ్యాయి. మిగిలిన 1,130 వార్డుల్లో 3,382 మంది బరిలో ఉన్నారు. కామారెడ్డి జిల్లాలోని బిచ్​కుంద,  జుక్కల్, డొంగ్లి , మద్నూర్​, పెద్దకొడప్​గల్​, బాన్సువాడ, బీర్కుర్​, నస్రుల్లాబాద్​ మండలాల్లో 168 పంచాయతీల్లో మూడో విడత ఎన్నికలు జరగనుండగా 26 పంచాయతీల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి.  మిగిలిన142 పంచాయతీలకుగాను 462 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,482 వార్డులకు గాను 449 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 13 వార్డుల్లో నామినేషన్లు రాలేదు. మిగిలిన 1,020 వార్డులకుగాను 2,790 మంది అభ్యర్థులు పోటీలో
 ఉన్నారు.  

ఉద్యోగుల ర్యాండమైజేషన్ కంప్లీట్​ 

పోలింగ్ విధుల్లో పాల్గొనే అధికారులు, ఉద్యోగుల 3వ ర్యాండమైజేషన్ ప్రక్రియ సోమవారం నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్​లలో నిర్వహించారు. నిజామాబాద్​కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి, జిల్లా అబ్జర్వర్ శ్యాంప్రసాద్​లాల్​, కామారెడ్డి కలెక్టర్​ఆశిష్​ సంగ్వాన్​, జిల్లా అబ్జర్వర్ సత్యనారాయణరెడ్డి సమక్షంలో ఉద్యోగుల ర్యాండమైజేషన్ పక్రియ జరిగింది. 

నేడు పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్న అధికారులు 

పోలింగ్ విధులు నిర్వహించే అధికారులు మంగళవారం గ్రామాలకు వెళ్లనున్నారు. ప్రతి మండల కేంద్రంలో డిస్ర్టిబ్యూషన్ సెంటర్​ను ఏర్పాటు చేశారు.  ఇక్కడ అధికారులు, ఉద్యోగులకు ఎన్నికల సామగ్రి అప్పగిస్తారు.  మధ్యాహ్నం తర్వాత అధికారులు సామగ్రి తీసుకుని వెళ్తారు.  పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉమ్మడి జిల్లాలో పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది. 

ఎత్తులు, పైఎత్తులు, దావత్​లు, నగదు పంపిణీ.. 

ఎన్నికల బరిలో అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నారు. ఒకరికొకరు పోటీ పడుతూ గ్రామాభివృద్ధి కోసం తమతమ మేనిఫెస్టోలను తెలుపుతూ ప్రచారాలు చేశారు. కుల, యువ సంఘాల మద్దతు కూడగట్టుకునేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం మటన్​, చికెన్ దావత్​లు నడిచాయి.  సాయంత్రం నగదు, లిక్కర్ బాటిల్స్ పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.  రెండు రోజులకు సరిపడా లిక్కర్​ను డంప్​చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా గెలువాలని సర్పంచ్​ అభ్యర్థులు ఓటుకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేయగా,  వార్డు సభ్యులు కూడా రూ.500 చొప్పున విడిగా పంపకాలు చేసినట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, మద్నూర్​, బిచ్కుంద, బీర్కుర్, నస్రుల్లాబాద్​ మండలాల్లో  దావత్​లు జోరుగా జరిగాయి.